Begin typing your search above and press return to search.

రాజోలు వైసీపీలో ముస‌లం.. కీల‌క నేత రాజీనామా.. 1000 మందితో క‌లిసి.. టీడీపీలోకి!

By:  Tupaki Desk   |   23 Jun 2022 4:14 AM GMT
రాజోలు వైసీపీలో ముస‌లం.. కీల‌క నేత రాజీనామా.. 1000 మందితో క‌లిసి.. టీడీపీలోకి!
X
రాజోలు నియోజకవర్గ వైసీపీలో ముసలం చెలరేగింది. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకట రామరాజు పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు 1000 మంది కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పారు.

బుధవారం సఖినేటిపల్లి మండలం గుడిమూలలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటరామరాజు మాట్లాడారు.

వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలన పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజోలు నియోజకవర్గంలో గత ఎన్నికలలో వైసీపీ కోసం కష్టించి పని చేసిన నాయకులు, కార్యకర్తలను పార్టీ అధిష్టానం విస్మరించడంపై నిరసన తెలిపారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల అసంతృప్తిని వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళినా పట్టించుకోలేదని తెలిపారు.

జనసేన నుండి వచ్చిన వారి పెత్తనం వైసీపీ కేడరుపై పెరిగిందని అన్నారు. వైసీపీ అధిష్టానం తీరు నచ్చక ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నామని వెంకటరామరాజు ప్రకటించారు.

తెలుగుదేశం పార్టీ నుండి ఆహ్వానం అందిందని, కార్యకర్తలతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వెంకటరామరాజుతో పాటు గుడిమూల మాజీ సర్పంచ్ కందుల సూరిబాబు, పొన్నమండ మాజీ సర్పంచ్ ఉండ్రు అమ్మాజీ సత్యనారాయణ రెడ్డి, ములికిపల్లి మాజీ సర్పంచ్ తాడి సత్యనారాయణ, కడలి మాజీ సర్పంచ్ వడ్డి సత్యం, టేకిశెట్టిపాలెం గ్రామ వైసీపీ అధ్యక్షులు పోతు ముత్యాలరావు (ఏసు), వైసిపి బిసి సెల్ గుడిమూల శాఖ అధ్యక్షులు గుబ్బల ఈశ్వరరావు, వైసీపీ జిల్లా కమిటీ సభ్యులు వలవల పృధ్వీసింగ్, చెన్నడం మాజీ సర్పంచ్ మట్టా ఈశ్వర బాలప్రసాద్ (అబ్బీస్), కూనవరం మాజీ సర్పంచ్ కలిగితి వెంకటేశ్వర రావు తదితరులు వైసీపీకి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.