Begin typing your search above and press return to search.

బీజేపీని ‘‘వైసీపీ’’ మార్కెట్ చేస్తుందా?

By:  Tupaki Desk   |   10 Aug 2021 11:30 AM GMT
బీజేపీని ‘‘వైసీపీ’’ మార్కెట్ చేస్తుందా?
X
రాజ‌కీయాల్లో ఎవ‌రు ఎవ‌రికి మిత్రులుగా ఉంటారో.. ఎవ‌రు ఎవ‌రికి శ‌త్రువులుగా మారుతారో చెప్ప‌లేని ప‌రిస్థితి. అలాగే రాజ‌కీయ పార్టీలు అనుస‌రించే వ్యూహాలు కూడా కొన్నిసార్లు ఓ ప‌ట్టాన అర్థం కావు. దాని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని ఇత‌ర పార్టీల‌పై విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌లు చేసిన‌ప్ప‌టికీ తుది ఫ‌లితం ద‌క్కుతుంద‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార వైసీపీ పార్టీ అనుస‌రిస్తున్న వ్యూహం కూడా అలాగే ఉంది. ఆ రాష్ట్రంలో ఎలాంటి బ‌లం లేని భార‌తీయ జ‌న‌తా పార్టీని వైసీపీ ల‌క్ష్యంగా చేసుకోవ‌డం ఏమిటో అర్థం కాకుండా ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు.

తాజాగా బీజేపీపై వైసీపీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. వైసీపీ ప్ర‌భుత్వాన్ని కూల్చాల‌ని, కాషాయ కండువా క‌ప్పుకున్న వ్య‌క్తిని సీఏం చేయాల‌ని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర ప‌న్నుతుంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఆయ‌న‌కు ఆ అనుమానం ఎందుకు వ‌చ్చిందో తెలీదు కానీ.. అందుకు స‌రైన ఆధారాలు మాత్రం ప్ర‌స్తావించ‌లేక‌పోయారు. త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేసి బాబా రాజ్యం తేవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని మాత్ర‌మే పేర్కొన్నారు. ఈ విష‌యం గురించి కాస్త లోతుగా ఆలోచిస్తే ఈ ఆరోప‌ణ‌లతో వైసీపీనే ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఏపీలో బీజేపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. ఆ రాష్ట్రంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఒక్క‌రు కూడా లేరు. క్షేత్ర‌స్థాయిలోనూ ఆ పార్టీకి బ‌లం లేదు. కార్య‌క‌ర్త‌ల సంఖ్య అంతంత‌మాత్ర‌మే. ఇటీవ‌ల తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌లో జ‌న‌సేన పోత్త‌తో పోటీచేసిన‌ప్ప‌టికీ ఆ పార్టీకి డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు. ఆ పార్టీని స‌మ‌ర్థంగా న‌డిపించే నాయ‌కత్వం అక్క‌డ లేదు. ఏనాడూ రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై బీజేపీ నేత‌లు క్షేత్ర‌స్థాయిలో పోరాటాలు చేసింది లేదు. ఆ పార్టీ ధ‌ర్నాకు పిలుపిచ్చినా ప‌ట్టుమ‌ని పది మంది కూడా రావ‌ట్లేదు. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీకి అభ్య‌ర్థులు కూడా క‌రువే. ప్ర‌స్తుతం అక్క‌డ బీజేపీ త‌ర‌పున ఏకైక ఎమ్మెల్సీగా మాధ‌వ్ మాత్ర‌మే ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అధికార ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుక ఆ పార్టీ ఎందుకు ప్రయ‌త్నిస్తుంది? ఒక‌వేళ అలా జ‌రిగినా అక్క‌డ అధికారంలోకి వ‌చ్చే సామ‌ర్థ్యం బీజేపీకి లేద‌నే మాట వాస్త‌వం.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజుపై త్వ‌ర‌లోనే వేటు ప‌డుతుంద‌నే ఊహాగానాలూ ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీపై మీడియాలో ఆరోప‌ణ‌లు చేస్తూ ఆ పార్టీకి ప్రాధ‌న్య‌త ఇవ్వ‌డం వెన‌క ఇంకేదో మ‌త‌ల‌బు ఉంద‌ని అర్థమ‌వుతోంది. బీజేపీకి ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డం వ‌ల్ల రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని పూర్తిగా సైలెంట్ చేయాల‌న్న‌ది వ్యూహంగా తెలుస్తోంది. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలోని టీడీపీకి రాష్ట్రంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు బాలేన‌ప్ప‌టికీ.. అధికార ప్ర‌భుత్వ వైఫ‌ల్యంపై ఆ పార్టీ నేత‌లు విమ‌ర్శ‌ల దాడి కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే బీజేపీని మార్కెట్ చేసి ప్ర‌యోజ‌నం పొందాల‌నే ఉద్దేశంతో వైసీపీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే జాకీ వేసి లేపినా అక్క‌డ బీజేపీ పుంజుకునే ప‌రిస్థితి లేదు. దీంతో బీజేపీ ప‌ట్ల ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం వైసీపీని కించ‌ప‌రిచిన‌ట్లే అవుతుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలే అంటున్నాయి. ఈ వ్యూహం పార్టీకి క‌లిసిరాద‌ని రాజ‌కీయ వేత్త‌లు అనుకుంటున్నారు.