Begin typing your search above and press return to search.

టార్గెట్ తాడిప‌త్రి: టీడీపీ క్యాంపును బ‌ద్ద‌లు కొట్టే వైసీపీ వ్యూహం..!

By:  Tupaki Desk   |   17 March 2021 3:41 PM GMT
టార్గెట్ తాడిప‌త్రి: టీడీపీ క్యాంపును బ‌ద్ద‌లు కొట్టే వైసీపీ వ్యూహం..!
X
రాష్ట్రంలో జ‌రిగిన మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ తిరుగులేని విజ‌యం సాధించింది. అయితే.. అనంత‌పురం తాడిప‌త్రిలో తెలుగు దేశం పార్టీ రెండు స్థానాలు ఎక్కువ‌గా ద‌క్కించుకుంది. మొత్తం 36 స్థానాలు ఉన్న తాడిప‌త్రి మునిసిపాలిటీలో టీడీపీ 18 చోట్ల గెల‌వ‌గా.. వైసీపీలో 16 - సీపీఐ - స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఒక్కో చోట గెలిచారు. ఎంపీ - ఎమ్మెల్యే ఉన్నారు కాబ‌ట్టి ఎక్స్ అఫీషియో ఓట్ల‌తో వైసీపీ బ‌లం కూడా 18కి పెరిగింది. అయితే.. టీడీపీలోని 18 మందిని మిగిలిన ఇద్ద‌రిని బ‌స్సెక్కించి హైద‌రాబాద్ త‌ర‌లించారట‌ టీడీపీ నేత జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి.

ఈ మొత్తం 20 మందిలో ఒక్క‌రు కూడా చేజార‌కుండా చూసుకోవ‌డం ద్వారా.. ఎలాగైనా చైర్మ‌న్‌ ప‌ద‌వి ద‌క్కించుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది టీడీపీ. ఆ వ్యూహాన్ని ప‌టాపంచ‌లు చేయాల‌ని చూస్తోంది వైసీపీ. ఆ క్యాంపు నుంచి కొంద‌రిని త‌మ‌వైపున‌కు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు ఆ పార్టీ నాయ‌కులు. ఈ క్ర‌మంలోనే ఓ అద్భుత‌మైన ప్లాన్ వేశార‌ట.

తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి మైనారిటీల‌కు ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ అక్క‌డ మైనారిటీలు చైర్మ‌న్ ప‌ద‌విని దక్కిచుకున్న సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. దీంతో.. వైసీపీ ముస్లింల‌కు చైర్మ‌న్ గిరీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా.. ఆ క్యాంపులోని మైనారిటీల‌కు గాలం వేస్తోంది.

మునిసిపాలిటీలోని మొత్తం 36 మందిలో 11 మంది కౌన్సిల‌ర్లు ముస్లిం మైనారిటీ వ‌ర్గానికి చెందిన వారు ఉన్నారు. వీరిలో టీడీపీ నుంచి గెలిచిన వారు ఒక‌రు కాగా.. టీడీపీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ఒక స్వ‌తంత్ర అభ్య‌ర్థి కూడా మైనారిటీనే. కాబ‌ట్టి వీళ్ల‌పై వైసీపీ గురిపెట్టింది. మ‌రి, వీరిలో ఎవ‌రైనా వైసీపీ వైపు మొగ్గుతారా? అనేది తీవ్ర ఉత్కంఠ‌గా మారింది. మ‌రి, ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చూడాలి.