Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యే జక్కంపూడి, ఎంపీ భరత్ లకు వైసీపీ అధిష్టానం పిలుపు

By:  Tupaki Desk   |   28 Sep 2021 10:35 AM GMT
ఎమ్మెల్యే జక్కంపూడి, ఎంపీ భరత్ లకు వైసీపీ అధిష్టానం పిలుపు
X
రాజమండ్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి మార్గాని భరత్, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య ఇటీవల మాటల యుద్ధం జరిగింది. ఒకే పార్టీలో ఉన్న వీరిద్దరూ బహిరంగ గొడవపడ్డారు. మీడియాకు ఎక్కి రచ్చ చేశారు. చివరికి ఈ వివాదంపై అధిష్టానం సీరియస్ అయ్యింది. వీరిద్దరినీ తాడేపల్లికి సీఎం జగన్ పిలిపించారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించి క్లాస్ పీకడానికి రెడీ అయ్యారు.

తూర్పు గోదావరి జిల్లాలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకోవడంతో సీనియర్ వైయస్ఆర్‌సి నాయకుడు.. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ద్వారా ఈ ఇద్దరికి సీఎం సందేశం పంపారు. వెంటనే ఎంపి, ఎమ్మెల్యే ఇద్దరినీ జగన్ తన ఇంటికి పిలిపించారు.

భరత్ , జక్కంపూడి తాడేపల్లికి వచ్చి మంగళవారం సాయంత్రం జగన్ ను కలసి తమ అభిప్రాయాలు తెలుపాలని కోరారు. పార్టీ అధ్యక్షుడు వారిద్దరితో వ్యక్తిగతంగా మాట్లాడి, ఇద్దరి మధ్య రాజీకి ప్రయత్నించాలని భావిస్తున్నారు. "బహిరంగంగా పార్టీకి నష్టం చేసేలా ఇద్దరూ వాదులాడుకోవడంపై జగన్ సీరియస్ గా ఉన్నారు. వారిద్దరూ మీడియాకు ఎక్కి విమర్శించుకున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ, ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికను కూడా పంపవచ్చు" అని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇసుక మైనింగ్, స్థానిక కాంట్రాక్టులతో సహా పలు అంశాలపై ఇరువురు నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. సీబీఐ మాజీ జేడీ వి లక్ష్మీనారాయణతో పాటు, టిడిపి, బిజెపి నాయకులతో ఎంపి భరత్ చేతులు కలిపారని ఎమ్మెల్యే జక్కంపూడి ఆరోపించారు.

భరత్, జక్కంపూడి మధ్య విభేదాలు తూర్పు గోదావరి జిల్లా పార్టీలో గ్రూపిజం ఏర్పడటానికి కారణమయ్యాయని జగన్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఇది మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ల ఎంపికలో ప్రతిబింబిస్తుందని అనుకుంటున్నారట.. అధికారిక అభ్యర్థులపై పార్టీలో తిరుగుబాట్లు జరుగుతాయని అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.

వైసీపీ హైకమాండ్ మొదట్లో ఈ పరిణామాలను పట్టించుకోలేదు. ప్రతి రాజకీయ పార్టీలోనూ ఇవి సర్వసాధారణం అని భావించినప్పటికీ, జిల్లాలో పనులు చేయి దాటిపోతున్నాయని తర్వాత అర్థమైంది. అందుకే జగన్ ఈ సమస్యపై వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నారని తెలుస్తోంది. వివాదాలను పరిష్కరించడానికి ఈ ఇద్దరిని తాడేపల్లికి పిలిచారు.