Begin typing your search above and press return to search.

గేట్లు తెరచిన వైసీపీ... టీడీపీయే టార్గెట్

By:  Tupaki Desk   |   30 Nov 2022 11:30 PM GMT
గేట్లు తెరచిన వైసీపీ... టీడీపీయే టార్గెట్
X
వైసీపీ విపక్షం కంటే ఎక్కువగా హడావుడి చేస్తోంది. ఎన్నికల ఏడాదిలో ఎపుడూ గోడ దూకుళ్ళు విపక్ష శిబిరం వైపు ఉంటాయి. అధికార పార్టీలో విసిగిన వారు, లేక తమకు టికెట్లు దక్కవని భావించేవారు అంతా కూడా ప్రధాన పక్షాన్ని చూసుకుని జంపింగ్స్ చేస్తారు. అయితే టీడీపీ ఇంకా సర్దుకునే పనిలో ఉంది. అంతలోనే వైసీపీ గేట్లు బార్లా తెరచేసింది.

తమ పార్టీలోకి రావాల్సిన వారికి ఆహ్వానం అని బిగ్ సౌండ్ చేస్తోంది. వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా పేరున్న రాయలసీమ నుంచే ఈ చేరికలకు జగన్ శుభారంభం పలికారు. మదనపల్లె మీటింగ్ కి వెళ్ళిన జగన్ అక్కడ బోణీ కొట్టారు. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డికి వైసీపీ కండువా కప్పేశారు. మదనపల్లె ప్రాంతంలో పట్టున్న నేతగా ఆయనకు గుర్తింపు ఉంది.

దాంతో టైంలీగా ఆయనను చేర్చుకున్నారు అని అంటున్నారు. ఇది జస్ట్ ఆరంభం మాత్రమే ఇంకా భారీ చేరికలు ఉంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. దానికి డిసెంబర్ నెలను ముహూర్తంగా పెట్టుకున్నారు. టీడీపీకి పట్టున్న ఉత్తరాంధ్రాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా సైకిల్ పార్టీకి గట్టి ఝలక్ ఇవ్వాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు.

అదే విధంగా గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు క్రిష్ణాలలో కూడా టీడీపీ నుంచి వైసీపీలోకి చేరే నేతల జాబితాను రెడీ చేసి పెట్టుకున్నారని అంటున్నారు. ఈ చేరికలు అన్నీ కూడా జనవరి ఎండింగ్ కి పూర్తి కావాలని వైసీపీ అధినాయకత్వం డెడ్ లైన్ పెట్టుకుంది అని తెలుసోంది. నిజానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కొంతకాలం ఆగి వైసీపీ వైపు రావాలని అనుకున్నారని టాక్.

అయితే ఆయనకు వైసీపీ అధినాయకత్వం మాటగా కొందరు కీలక నేతలు చెప్పినది ఏంటి అంటే మంచి సమయం మించనీయకూడదు అని. ఇప్పుడే చేరిపోతేనే బెటర్. లేట్ చేయవద్దు అని ఒక కీలకమైన మేసెజ్ ని పంపించారుట. అంటే మదిలో ముందస్తు ఎన్నికల ఆలోచనలు ఉన్నాయో ఏమో తెలియదు కానీ చేరికలకు వైసీపీ తెర తీసింది అని అంటున్నారు. బలమైన నాయకులు, సామాజికవర్గం పరంగా పట్టు ఉన్న వారిని ఏరి కోరి మరీ వైసీపీలోకి చేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు అని అంటున్నారు.

గతంలో ఇతర పార్టీల నుంచి వచ్చే వారి విషయంలో అనేక రకాలైన కండిషన్లు పెట్టిన వైసీపీ హై కమాండ్ ఆలోచనలలో ఒక్కసారిగా మార్పు వచ్చింది అని అంటున్నారు. దానికి కారణం పక్కా వ్యూహమే అని తెలుస్తుంది. ఏపీలో వైసీపీకి ఆదరణ చెక్కు చెదరలేదు అన్న సందేశాన్ని జనాల్లోకి పంపించడంతో పాటు టీడీపీని వీలైనంతవరకూ వీక్ చేసి పారేయాలని అన్నదే అజెండాగా పెట్టుకున్నారు అని అంటున్నారు.

అయితే ఈ చేరికలు గోడ దూకుళ్ళు అన్నవి ఒక స్ట్రాటజీ అని జనాలకు కూడా తెలుసు కాబట్టి వారు తాము కోరుకున్న పార్టీనే అధికారంలోకి తీసుకువస్తారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక వైసీపీ నుంచి కూడా టీడీపీలోకి పెద్ద ఎత్తున గోడ దూకుళ్ళు ఉంటాయని తాము రివర్స్ అటాక్ చేస్తామని వారు అంటున్నారు. ఏది ఏమైనా ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్న వేళ అధికార పక్షం నుంచి పవర్ ని వదులుకుని నేతలు రారు. ఆ అడ్వాంటేజ్ ని సొమ్ము చేసుకుంటూ విపక్ష టీడీపీని వైసీపీ గట్టిగానే టార్గెట్ చేస్తోంది. మరి ఏ జిల్లాల్లో ఎంత మంది నేతలు వైసీపీ గేలానికి చిక్కుతారో చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.