Begin typing your search above and press return to search.

వైసీపీలో కాక రేపుతున్న 'ఆత్మ‌కూరు' ఉప ఎన్నిక‌.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   10 Jun 2022 4:43 AM GMT
వైసీపీలో కాక రేపుతున్న ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌.. రీజ‌న్ ఇదే!
X
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ఏపీ అధికార పార్టీ వైసీపీలో కాక రేపుతోంది. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకుని.. జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి కూడా అయిన మేక‌పాటి గౌతం రెడ్డి.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో హ‌ఠాన్మ‌ర‌ణం చెందిన త‌ర్వాత‌.. ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అనివార్య ఉప ఎన్నికకు రంగం సిద్ధ‌మైంది. అయితే.. దీనిని గెలిచి తీరాల‌ని.. వైసీపీ ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఎందుకంటే.. రెండు కార‌ణాలు ఒక‌టి సెంటిమెంటు. రెండోది.. వైసీపీ మూడేళ్ల పాల‌న‌కు ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌లు రెఫ‌రెండంగా మార‌నున్నాయి.

నిజానికి ఇలాంటి సంద‌ర్భంగా(అంటే.. ఎమ్మెల్యే మృతి చెందిన‌ప్పుడు) గెలుపు ఏక‌ప‌క్షంగానే ఉంటుంది. కానీ.. ఇప్పుడు వైసీపీలో మాత్రం ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. మూడేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తిగా ఉండ‌డం. అదేస‌మ‌యంలో సానుభూతి కోణాన్ని ఈ ద‌ఫా.. ప్ర‌జ‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ వినిపిస్తుండ‌డం. ఈ నేప‌థ్యంలోనే.. వైసీపీలో ఆత్మ‌కూరు సెగ‌లు పుట్టిస్తోంది. ఇక‌, ఇక్క‌డ నుంచి ఏకంగా 14 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు.

నామినేష‌న్ల చివరిరోజు ఇండిపెండెంట్‌ అభ్యర్థి బొర్రా సుబ్బారెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకు న్నా బరిలో మాత్రం 14 మంది అభ్యర్థులు తలపడుతున్నారు.

వీరిలో మేకపాటి విక్రమ్‌రెడ్డి - వైసీపీ, గుండ్లవల్లి భరత్‌కుమార్‌ - బీజేపీ, నందా ఓబులేశు-బీఎస్పీ, షేక్‌ జలీల్‌-నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ, షేక్‌ మొయినుద్దీన్‌-ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌, బండారు రవి-హర్ధమ్‌ మన్వట్వాడి రాష్ట్రీయ దళ్‌, బూరుగ రత్నం-ఇండిపెండెంట్‌, చల్లా పెంచలమోహన్‌రెడ్డి -ఇండిపెండెంట్‌, పెనాకా అమర్‌నాథ్‌రెడ్డి-ఇండిపెండెంట్‌, పెయ్యల హజరత్తయ్య-జనంమనం పార్టీ, రావులకొల్లు మాలకొండయ్య-ఇండిపెండెంట్‌, షేక్‌ మహబూబ్‌బాష-అన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, తూమాటి శశిధర్‌రెడ్డి-ఇండిపెండెంట్‌, లాలి వెంకటయ్య - ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నారు.

ఇంత మంది పోటీ చేస్తుండ‌డంతో ఓట్లు బాగా చీలే అవ‌కాశం ఉంద‌ని.. వైసీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి తీవ్ర‌స్తాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. స‌ర్కారు ఏమీ చేయ‌డం లేద‌ని.. చెబుతున్నారు.

ఈ నేప‌థ్యానికి తోడు.. వైసీపీ కాకుండా 13 మంది వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు, ఇండిపెండెట్లు పోటీ చేస్తుండ‌డంతో యువ‌త‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని సూచ‌న‌లు వ‌స్తుండ‌డంతో వైసీపీ తీవ్ర‌స్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గుర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏమేర‌కు విజ‌యం సాధిస్తారో చూడాలి.