Begin typing your search above and press return to search.

ఇలా ఎమ్మెల్సీ.. ఆలా మంత్రి పదవా... ?

By:  Tupaki Desk   |   21 Nov 2021 3:30 AM GMT
ఇలా ఎమ్మెల్సీ.. ఆలా మంత్రి పదవా... ?
X
ఆయనది పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ. అధికార పదవి ఎపుడూ ఆయనతో దోబూచులే ఆడింది. గెలుస్తామని అనుకున్న సమయంలో టికెట్ దక్కలేదు. మరో వైపు గట్టి పోటీ ఉందనుకున్న వేళ పోటీ చేసి పార్టీకి అండగా నిలిచారు. ఆయనే విశాఖ వైసీపీ నగర ప్రెసిడెంట్ వంశీ క్రిష్ణ శ్రీనివాస్. ఆయనకు మొత్తానికి ఎమ్మెల్సీ పదవి దక్కింది. స్థానిక సంస్థల కోటాలో ఆయన పేరుని జగన్ ప్రకటించారు. భారీ జన సందోహంతో పాటు, అభిమానుల మధ్యన ఆయన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయన ఎన్నిక అన్నది ఇక లాంచనమే. తొందరలోనే ఎమ్మెల్సీగా పెద్దల సభలో అడుగుపెట్టడం ఖాయం. ఈ నేపధ్యంలో వంశీ ఫ్యూచర్ పాలిటిక్స్ మీద కూడా చర్చ సాగుతోంది.

వంశీ నామినేషన్ దాఖలు ఘట్టానికి హాజరైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఈ పదవి కాదు, ఇంకా పెద్ద పదవులు వంశీని వరిస్తాయని దీవించారు. వంశీకి ఇప్పటిదాకా అన్యాయం జరిగింది. కానీ ఇపుడు ఆయన దశ తిరిగింది అన్నట్లుగా మాట్లాడారు. పార్టీని నమ్ముకున్నందుకు వంశీకి ఈ గుర్తింపు దక్కిందని కూడా చెప్పారు. ఇక మీదట ఆయనది అంతా రాచబాటే అని కూడా చెప్పుకొచ్చారు.

వంశీకి ఇంతకు మించి పెద్ద పదవులు లభిస్తాయని విజయసాయిరెడ్డి అనడంతో వంశీ అభిమానులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి పెద్ద పదవి అంటే మంత్రి సీటును పట్టేయడమే. విశాఖ సిటీకి చెందిన వంశీ కీలక నాయకుడు. పైగా విశాఖ సిటీ నిండా విస్తరించిన బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాసరావుని తప్పిస్తే కనుక సిటీ నుంచి వంశీకి చాన్స్ తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు.

ఇక రాజకీయంగా వంశీ రాటుదేలారు, అంతే కాదు, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారు. దాంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడాన్ని ఎవరూ తప్పుపట్టే సీన్ లేదు. గట్టిగా చెప్పాలీ అంటే విశాఖలో వైసీపీ జెండాను తొలిసారిగా పట్టుకున్న నేతగా వంశీ ఉన్నారని అంటున్నారు. మరి విజయసాయిరెడ్డి నోట పెద్ద పదవులు అన్న మాట ఊరకే రాదు అని కూడా పేర్కొంటున్నారు. మరో వైపు చూస్తే జగన్ ఎపుడూ కూడా అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాంతో వంశీకి మంత్రి పదవి దక్కినా దక్కవచ్చు అంటున్నారు. అదే జరిగితే మాత్రం వంశీకి డబుల్ జాక్ పాటే మరి. సో చూడాల్సిందే.