Begin typing your search above and press return to search.

ఈ ట్వీట్ ఫస్ట్రేషన్ ఏంది విజయసాయి?

By:  Tupaki Desk   |   9 Aug 2022 1:30 PM GMT
ఈ ట్వీట్ ఫస్ట్రేషన్ ఏంది విజయసాయి?
X
ఎంత రాజకీయం అయితే మాత్రం మనిషి.. మనిషిగా గౌరవించకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరు ఎవరు ప్రదర్శించినా గర్హించాల్సిందే. రాజకీయాల్లో మర్యాదలకు చెల్లు చీటి ఇచ్చిన నేతల్లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని మొదటి వ్యక్తిగా చెప్పొచ్చు. సోషల్ మీడియాను అసరాగా చేసుకొని ఎంత మాట పడితే అంత మాట అనేయటం.. ఆయనకే చెల్లుతుంది. అయితే..ఆయన మాటల్లో పస కంటే కూడా నస ఈ మధ్యన ఎక్కువైంది. తాజాగా మోడీ - బాబు పలుకరింపు ఎపిసోడ్ విషయంలో వైసీపీ పడుతున్న టెన్షన్.. ఫస్ట్రేషన్ ఆసక్తికరంగానే కాదు.. విస్మయానికి గురి చేసేలా మారింది.

ఎందుకంటే.. తాజాగా ట్విటర్ ఖాతాలో తన ఫస్ట్రేషన్ ను నాలుగు ట్వీట్లతో పలికించిన విజయసాయి మాటలు విన్నంతనే బోలెడంత ఫన్ కలగటం ఖాయం. ఎందుకంటే.. తప్పు చేసినోడు దాన్ని కవర్ చేయటానికి ఎక్కువ తప్పులు చేస్తారన్న దానికి నిదర్శనంగా.. ఏమీ లేనప్పుడు.. ఏదో ఒకటి చూపించి హడావుడి చేయాలన్న తపన కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి తీరునే విజయసాయి రెడ్డి ప్రదర్శించారని చెప్పాలి.

మోడీని ఒక కార్యక్రమంలో కలిసిన సందర్భంగా.. టీడీపీ అధినేత చంద్రబాబును.. ఆయన పక్కకు తీసుకెళ్లి ఐదు నిమిషాలు మాట్లాడటం.. దానికి సంబంధించిన ఏం మాట్లాడారన్న దానికి సంబంధించి నాలుగైదు వ్యాక్యాలు మీడియాలో వచ్చింది. ఆ మాత్రం దానికే జగన్ టీం ఆగమాగం అయిపోవటం విశేషం. నిన్నటికి నిన్న ప్రభుత్వ సలహాదారు పొజిషన్లో ఉన్న పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్రేట్ అయితే.. తాజాగా విజయసాయి వరుస ట్వీట్లతో పడిన అవస్తలు చూస్తే కామెడీగా అనిపించక మానదు.

ఇంతకీ నాలుగు వరుస ట్వీట్లతో విజయసాయి ఏమన్నారన్నది ఆయన మాటల్లోనే చూస్తే..

1. నీతీ ఆయోగ్‌ సమావేశం లంచ్ విందులో ప్రధాని టేబుల్‌ నెంబర్:1 కు ఆహ్వానితులుగా ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు లెఫ్టినెంట్‌ గవర్నర్లు ఉన్నారు. ఆ ముగ్గురిలో మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు ఒకరు.

2. కాకపోతే, గంటకు పైగా ఒకే టేబుల్‌ దగ్గర లంచ్ విందులో మాట్లాడుకున్నా ప్రచారం కోరుకోని జగన్‌గారి స్థాయి ఎక్కడ? నిలబడి ప్రధాని తనతో రెండు నిమిషాలు మాట్లాడినందుకు అయిదు గంటలకు సరిపడ కట్టుకథ అల్లిన బాబు ఆయన పచ్చకులమీడియా స్థాయి ఎక్కడ?

3. ప్రజల్లో స్వయం ప్రకాశం లేని బాబు... 1994లో వెన్నుపోటుతో అధికారం లాక్కుని, 1999లో కార్గిల్‌ యద్ధం వల్ల; 2019లో మోడీగారి గాలిలో అధికారంలోకి రావటం తప్పితే... సొంతంగా ఒక్కసారి కూడా గెలిచింది లేదు.

4. ఇలాంటి వారిని ఇంగ్లీష్‌లో పేరసైట్స్ అంటారు. అంటే... పరాన్న జీవులు! ఢిల్లీలోని అన్ని పార్టీల ఇళ్ళలోనూ తిని... అందరి ఇళ్ళ వాసాలూ లెక్కపెట్టిన ఈ చంద్రబాబు అనే ద్రోహిని ఎవరైనా మళ్ళీ కలుద్దాం, మా ఇంటికి రండి అని ఎందుకు అంటారు?

ఈ నాలుగు ట్వీట్లలోని భాషను చూస్తేనే దాని వెనుకున్న బాధ ఇట్టే అర్థమైపోతుంది. ఇలా అనవసర ఆవేశానికి గురై.. లేనిపోని ఆయాసాన్ని తెచ్చుకునే కన్నా.. మౌనంగా ఉంటే కాస్తంత మర్యాద మిగులుతుందేమో. అందుకు భిన్నంగా ఎంత ఎగిరెగిరి పడినా.. చంద్రబాబును నోటికి వచ్చినట్లు తిట్టటం తప్పించి మరింకేమీ ఉండదన్న విషయం అందరికి తెలిసిందే. తిట్టే కొద్దీ.. అవతల వ్యక్తి మీద సానుభూతి పెరుగుతుందన్న కనీస సోయి విజయసాయి లాంటి లెక్కల మేధావికి ఎందుకు గుర్తుకు రాదు చెప్మా?