Begin typing your search above and press return to search.

వైసీపీ తీవ్ర నిర్ణ‌యాలు.. టీడీపీని ఏ మేర‌కు కాపాడ‌తాయి?

By:  Tupaki Desk   |   10 March 2020 5:40 AM GMT
వైసీపీ తీవ్ర నిర్ణ‌యాలు.. టీడీపీని ఏ మేర‌కు కాపాడ‌తాయి?
X
సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగి దాదాపు 11 నెల‌లు అయిపోయాయి. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల‌కు ఏపీలో రంగం సిద్ధం అవుతూ ఉంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా వ‌చ్చాయో ప్ర‌త్యేకంగా వివ‌రించన‌క్క‌ర్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంప‌ర్ మెజారిటీతో అధికారాన్ని సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ చిత్తు అయ్యింది. 11 నెల‌ల జ‌గ‌న్ పాల‌న అనంత‌రం ఇప్పుడు స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతూ ఉన్నాయి.

ఇలాంటి క్ర‌మం లో తెలుగుదేశం పార్టీ ఒక‌వైపు తీవ్ర స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతూ ఉంది. ఏపీలో అధికారం కోల్పోవ‌డంతో చాలా మంది టీడీపీ నేత‌లు ప‌క్క చూపులు చూశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు ఎంచ‌క్కా అవ‌కాశాల‌ను ఉప‌యోగించుకున్న వారు ఆ పార్టీ అధికారం కోల్పోగానే జెండా పీకేశారు. త‌మ దారి తాము చూసుకున్నారు. చాలా మంది నేత‌లు పార్టీలోనే ఉన్నా.. వారు అంత యాక్టివ్ గా ఉండ‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తూ ఉంది. స్థానిక ఎన్నిక‌ల్లో అధికార పార్టీతో పోటాపోటీగా త‌గులుకోవ‌డానికి చాలా మంది తెలుగుదేశం నేత‌ల‌కు ధైర్యం చాల‌డం లేదు!

అందుకు ప్ర‌ధాన కార‌ణాలు.. వారి లోపాలు వారితో ఉండ‌ట‌మే. అధికార ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం నేత‌లు హ‌ల్చ‌ల్ చేశారు. అనేక వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చారు. వాటిల్లో అవినీతి వ్య‌వ‌హారాలు పుష్క‌లంగా ఉన్న దాఖ‌లాలు క‌నిపిస్తున్నాయి. దీంతోనే చాలా మంది నేత‌లు పొలిటిక‌ల్ గా యాక్టివ్ గా ఉండ‌టం లేద‌నే అభిప్రాయాలూ ఉన్నాయి. ఇలాంటి త‌రుణంలో కూడా తెలుగుదేశం పార్టీకి కొన్ని ఆశ‌లు అయితే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలు, చంద్ర‌బాబుతో వ్య‌వ‌హ‌రించిన తీరు త‌మ‌కు ప్ల‌స్ అవుతుంద‌న్న‌ట్టుగా టీడీపీ భావిస్తూ ఉంది.

అందులో ముఖ్య‌మైన‌ది అమరావ‌తి విష‌యంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం. మూడు రాజ‌ధానుల ఫార్ములాను ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డ‌టం లేదు అనేది టీడీపీ వెర్ష‌న్. ఈ మేర‌కు త‌మ‌కు మ‌ద్ద‌తు ఉంద‌ని టీడీపీ అంటోంది. మ‌రి అది మేర‌కు ఉందో స్థానిక ఎన్నిక‌ల‌తోనే స్ప‌ష్టం అవుతుంది!

ఇక రెండో విష‌యం.. విశాఖ‌ లో చంద్ర‌బాబు నాయుడును వైసీపీ వాళ్లు అడ్డుకోవ‌డం. త‌మ హ‌యాంలో ప్ర‌తిప‌క్ష నేత‌ను కావాల్సిన చోట‌కు తిర‌గ‌నిచ్చిన‌ట్టుగా తెలుగుదేశం చెబుతోంది. అయితే ఇప్పుడు చంద్ర‌బాబును ప‌ర్య‌టించ‌కుండా వైసీపీ అడ్డుకుంద‌ని, ఇందుకూ ఆ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంద‌ని తెలుగుదేశం పార్టీ వాళ్లు అంటున్నారు. ఇక జ‌గ‌న్ పాల‌న గురించి తెలుగుదేశం పార్గీ ఏ స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతూ ఉన్నదీ తెలిసిందే.

జ‌గ‌న్ ది అరాచ‌క పాల‌న అని, అర్థం లేని పాల‌న అని.. తెలుగుదేశం పార్టీ లెక్క‌లేన‌న్ని ఆరోప‌ణ‌లు చేస్తూ ఉంది. అది కూడా తీవ్రమైన మాట‌ల‌తో విరుచుకుప‌డుతూ ఉంది. ఆ మాట‌ల‌ను ప్ర‌జ‌లు ఏ మేర‌కు విశ్వ‌సిస్తార‌నేది స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో స్ప‌ష్ట‌త రావొచ్చు!