Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేపై తిర‌గ‌బ‌డ్డ‌.. వైసీపీ మ‌హిళా నేత‌!

By:  Tupaki Desk   |   5 April 2022 6:11 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేపై తిర‌గ‌బ‌డ్డ‌.. వైసీపీ మ‌హిళా నేత‌!
X
ఏపీ పాల‌క ప‌క్షం వైసీపీలో నేత‌ల‌పై దిగువ‌శ్రేణి నాయ‌కులు.. కార్య‌క‌ర్త‌ల ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెగుతోంది. ఎ న్నికల స‌మ‌యంలో త‌మ‌ను వాడుకుని వ‌దిలేశార‌ని.. ఇప్పుడు.. మాత్రం క‌నీసం కంటికి కూడా క‌నిపిం చ‌కుండా తిరుగుతున్నార‌ని.. కార్య‌క‌ర్త‌లు.. నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ‌డుతున్నారు. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేపైనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం.. బండ‌బూతులు తిట్ట‌డం.. వంటివి.. మ‌రింత‌గా పార్టీలో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఏ చిన్న‌ప‌ని చేయాల‌న్నా.. ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండ‌డం లేద‌ని కొన్నాళ్లుగా వినిపిస్తున్న టాక్‌.

అయితే. ఇలాంటి వాటి విష‌యంలో కార్య‌క‌ర్త‌లు స‌ర్దుకుపోతారు. మ‌రి దీనికి భిన్నంగా ఒక ఎమ్మెల్యేపై అదే వైసీపీకి చెందిన మ‌హిళా నాయ‌కురాలు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌డం.. రాజ‌కీయ వ‌ర్గాల్లోను.. వైసీపీలోనూ.. తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. విష‌యం ఏంటంటే.. కృష్ణా జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుపై వైసీపీకే చెందిన మ‌హిళా నాయ‌కురాలు.. య‌ల‌వ‌ర్తి భ‌వానీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండ బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. క‌డుపులో ఉన్న బాధ‌నంతా బ‌హిరంగ వేదిక‌గా కక్కేశారు. దీంతో స‌మావేశానికి వ‌చ్చిన‌వారు క‌ళ్ల‌ప్ప‌గించి.. చూస్తూ ఉండిపోయారు.

సొంత పార్టీ మహిళనైన తనకే గౌరవం ఇవ్వని ఎమ్మెల్యే ప్రజలకు ఎలా గౌవ‌రం ఇస్తాడని సభా వేధికపైనే ఆమె నిలదీశారు. ఉగాదిని పుర‌స్క‌రించుకుని కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకురాలు తిరువీధుల శారద విందు ఏర్పాటు చేశారు.

ఈ విందు సభకు వచ్చిన భవానీ మైకు అందుకోవడమే ఆలస్యం.. స్థానిక ఎమ్మెల్యేపై తన ప్రతాపం చూపారు. ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. తాను ఒక పనిపై ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే కనీస మర్యాద ఇవ్వకుండా తనను అవమానిస్తూ మాట్లాడారని ఆరోపించారు. సొంత పార్టీ నేత అని కూడా చూడకుండా దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

"నేను భవానీని.. కలిదిండి వస్తే నా సత్తా చూపిస్తా.." అంటూ ఆమె ఎమ్మెల్యేకి సభలోనే సవాల్‌ విసిరారు. వైసీపీలో ఉంటూ కూడా ఇబ్బందులు పడుతున్నామంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేని బూతులు తిట్టడం, సభలోనే ఆయనకు సవాల్‌ విసరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తనను ఇబ్బందులు పెట్టారని, ఇంకా పెడుతూనే ఉన్నారని ఆమె ఆవేదన వెళ్లగక్కారు. తనపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో పరుష పదజాలంతో బూతులు తిట్టారు.

కాగా, అధికార పార్టీలో ధిక్కార స్వరం రోజు రోజుకూ పెరుగుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్గ పోరు పెరుగుతోంది. సీనియర్ నేతలు.. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతకుముందు అనకాపల్లికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరబద్ర రావు.. నేరుగా జగన్ పాలనలో అక్రమాలు జరుగుతూ ఉన్నాయని.. దీనిపై అధినేత చూసుకోవాలని సూచనలు కూడా చేశారు. ఆయన వ్యాఖ్యల కలకలం కొనసాగుతున్నాయి. మ‌రి మున్ముందు ఈ ప‌రిస్థితి ఎటువైపు దారి తీస్తుందో చూడాల‌ని అంటున‌నారు ప‌రిశీల‌కులు.