Begin typing your search above and press return to search.

సామాజిక న్యాయ‌భేరి.. సాధించేదేంటి? మిగిలిది మాత్రం 10 కోట్ల ఖ‌ర్చు

By:  Tupaki Desk   |   26 May 2022 3:30 PM GMT
సామాజిక న్యాయ‌భేరి.. సాధించేదేంటి?  మిగిలిది మాత్రం 10 కోట్ల ఖ‌ర్చు
X
టీడీపీ చేప‌ట్టిన మ‌హానాడుకు పోటీగా.. ఏపీ అధికార పార్టీ వైసీపీ సామాజిక న్యాయ‌భేరి పేరుతో యాత్ర‌ను ప్రారంభించింది. అయితే.. ఇప్ప‌టికే.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌భుత్వం.. పేరు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. అయినా.. దీనివ‌ల్ల త‌మ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని భావిస్తున్న ప్ర‌భుత్వం మ‌హానాడుకు పోటీగా.. ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. అయితే..దీనికి గాను వైసీపీ ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తున్న మొత్తం రూ.10 కోట్లు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో అస‌లు ఈ కార్య‌క్ర‌మంతో వైసీపీ సాధించేది ఏంట‌నేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న సామాజిక న్యాయం.. ప్రజలకు వివరించేందుకు.. "సామాజిక న్యాయ భేరి" పేరిట వైసీపీ మంత్రులు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని ఏడు రోడ్ల కూడలిలో బస్సు యాత్ర ప్రారంభమైంది. ముందుగా అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం.. సన్‌రైజ్‌ హాటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో సీఎం జగన్‌ సృష్టించిన సామాజిక విప్లవం దేశమంతా అవలంబించాలని.. మంత్రులు ఆకాంక్షించారు. మంత్రివర్గంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు 'సామాజిక న్యాయభేరి' పేరిట శ్రీకాకుళం నుంచి 4 రోజుల బస్సు యాత్ర ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న 17 మంది మంత్రులు తమ తమ సామాజిక వర్గాలకు ప్రభుత్వంలో దక్కిన ప్రాధాన్యాలను వివరిస్తామని చెప్పారు. 82 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

కార్పొరేషన్లకు నిధులు ఎంత ఇచ్చారనేది ముఖ్యం కాదని, రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడం ముఖ్యమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్రంలోని ప్రజలను చైతన్యపరిచేందుకే బస్సు యాత్ర చేపట్టామని పశుసంవర్థక శాఖా మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జగన్‌ స్ఫూర్తిని దేశంలో అందరూ పాటిస్తారని.. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడతామని తెలిపారు. జగన్‌ ఉద్దేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన బస్సు యాత్ర ఎచ్చెర్ల, రణస్థలం చేరుకున్న అనంతరం అక్కడ నుంచి విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ, నాతవలస, డెంకాడ వరకు బస్సు పర్యటన సాగుతోంది. తర్వాత విశాఖపట్నం బయలుదేరి వెళ్లి రాత్రి అక్కడ బస చేస్తారు. 27న విశాఖలో బయలుదేరి గాజువాక, లంకెలపాలెం కూడలి, అనకాపల్లి జంక్షన్‌, తాళ్లపాలెం జంక్షన్‌, యలమంచిలి వై జంక్షన్‌, నక్కపల్లి, కత్తిపూడి, జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంటారు.

అక్కడ బహిరంగ సభ నిర్వహించి రాత్రికి తాడేపల్లిగూడెం వెళ్లి అక్కడే బస చేస్తారు. 28న నారాయణపురం, ఏలూరు బైపాస్‌, హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం, విజయవాడ తూర్పు, మంగళగిరి, గుంటూరు ఆటోనగర్‌, చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట చేరుకుని బహిరంగ సభ నిర్వహిస్తారు. నంద్యాలలో రాత్రి బస చేస్తారు. 29న పాణ్యం, కర్నూలు, డోన్‌, వెల్దుర్తి, గుత్తి, పామిడి, గార్లదిన్నె మీదుగా అనంతపురం వెళ్లి అక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మొత్తంగా చూస్తే.. మ‌హానాడు జ‌ర‌గుఉతున్న మూడు రోజులు కూడా వైసీపీ నేత‌లు యాత్ర చేయ‌డం గ‌మ‌నార్హం.