Begin typing your search above and press return to search.

వైసీపీ 65...టీడీపీ 50...జనసేన 25... అసలు ఏంటీ లెక్కలు...?

By:  Tupaki Desk   |   27 Nov 2022 9:32 AM GMT
వైసీపీ 65...టీడీపీ 50...జనసేన 25... అసలు ఏంటీ లెక్కలు...?
X
ఏపీలో రాజకీయ పార్టీల అంచనాలు వారు వేసుకుంటున్న లెక్కలు హద్దు మీరుతున్నాయా లేక నిజంగానే వారు అలా కచ్చితమైన లెక్కలతో ఉన్నారా అన్నది కనుక చూస్తే ఆసక్తిని రేపుతోంది. ఏపీలో అధికార పక్షం వై నాట్ 175 సీట్స్ అని అంటోంది. దానికి ప్రాతిపదిక ఏంటి అంటే వార్ వచ్చే ఎన్నికల్లోనూ వన్ సైడ్ గా సాగుతుంది అని చెబుతోంది. అంతే కాదు వైసీపీ పట్ల జనాలలో ఉన్న పాజిటివిటీ మరింతగా పెరుగుతోంది అని కూడా ధీమా చేస్తోంది.

ఇంతకీ వైసీపీ నమ్మకం వెనక రీజన్స్ ఏంటి అంటే ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో దాదాపుగా యాభై శాతం ఓట్లు వచ్చాయి. అవి కాస్తా మూడున్నరేళ్ళ పాలన పూర్తి అయ్యేనాటికి మరో పదిహేను శాతం పైగా యాడ్ అయ్యాయని కొత్త విషయాలను చెబుతోంది. అదెలా అంటే ఈ మధ్య కాలంలో మూడు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో ఒకటి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఉంది. అలాగే కడప జిల్లా బద్వేల్ లోనూ, నెల్లూరు జిల్లా ఆత్మకూరులోనూ ఉప ఎన్నికలు జరిగితే వైసీపీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా గెలిచి సత్తా చాటింది.

దాంతో పాటు ఆ ఎన్నికల్లో మొత్తం పోల్ అయిన ఓట్లలో అరై అయుదు శాతం పైగా వైసీపీకే వచ్చాయని లెక్కలు చెబుతున్నారు. ఇక లోకల్ బాడీ ఎన్నికలు తీసుకుంటే అందుకో కూడా నూటికి ఎనభి నుంచి తొంబై శాతం దాకా వైసీపీకే జనాలు ఓట్లేసి గెలిపించారని, అలా గ్రౌండ్ లెవెల్ లో కూడా తమ పార్టీకి కొత్త బలం వచ్చి చేరిందని చెప్పుకుంటోంది.

ఇవన్నీ కూడుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో 65 శాతం పైగా ఓటు షేర్ వైసీపీ సాధిస్తుంది కాబట్టి వై నాట్ 175 సీట్లు అని ఆ పార్టీ విశ్లేషించుకుంటోంది. సరే అధికార పార్టీ అంచనాలు అలా ఉన్నా నిజానికి ఆ ఎన్నికల్లో చూస్తే తిరుపతిలో తప్ప టీడీపీ ఎక్కడా పోటీ చేయలేదు. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ జెడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరించింది. అంతే కాకుండా అధికార పార్టీకి ఉప ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలూ ఎపుడూ ప్లస్ గానే ఉంటాయన్న విశ్లేషణ ఉంది. మరి అక్కడ 65 శాతం ఓట్ల షేర్ దక్కిందని అదే సార్వత్రిక ఎన్నికల్ల్లోనూ రిపీట్ అవుతుందని వైసీపీ భావిస్తే అది నిఖార్సు అయిన వాదన అవుతుందా అన్నది ఆ పార్టీ నేతలే ఆలోచించాలి అని అంటున్నారు.

ఇక టీడీపీ విషయం తీసుకుంటే యాభై శాతం ఓట్ల షేర్ వచ్చే ఎన్నికల్లో రాబడతామని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే టీడీపీ పుట్టిన నాటి నుంచి తీసుకుంటే ఎపుడూ కూడా 48 శాతం ఓటింగ్ ని దాటిన సందర్భం లేదు. అది కూడా ఎన్టీయార్ బతికి ఉండగానే అంత పెద్ద ఓట్ల శాతం వచ్చింది. ఇక చంద్రబాబు హయాంలో రెండు సార్లు టీడీపీ గెలిచినా కూడా ఓట్ల షేర్ ఎపుడూ 45 శాతాన్ని మించలేదు. ఎంతటి వేవ్ ఉన్నా ఇదే సీన్ కనిపించింది. గతంలో వాజ్ పేయ్ ఒక్క ఓటు సానుభూతి కలసినా 2024లో మోడీ వేవ్, పవన్ చరిష్మాను కలుపుకున్నా 45 శాతం దగ్గరే ఆగింది. మరి ఈసారి 50 శాతం ఓట్ల షేర్ ఎలా వస్తుంది అన్నది పెద్ద ప్రశ్న. అయితే వైసీపీకి అంతటి వ్యతిరేకత ఉంది కాబట్టి అది తమకు టర్న్ అవుతుంది అని టీడీపీ నేతలు చెబుతున్నారు. పైగా 2019లో వైసీపీకి వచ్చిన వేవ్ కంటే తమకు మరింత ప్రభంజనం వస్తుందని కూడా భావిస్తున్నాయి.

ఎంత వైసీపీ తీసికట్టు అయిపోయినా కూడా టీడీపీకి ఆ ఓట్ షేరింగ్ వస్తుందా అంటే అది అనుమానమే. ఇపుడు ముచ్చటగా మూడవ పార్టీగా ఉన్న జనసేన గురించి చెప్పుకుంటే ఆ పార్టీకి ఆరు శాతం ఓట్ల షేర్ 2019 ఎన్నికల్లో లభించింది. ఆ ఎన్నికల్లోనే పవన్ తనను తాను సీఎం అభ్యర్ధిగా ప్రమోట్ చేసుకుంటూ జనంలోకి వెళ్లారు. అది ఫస్ట్ టైం. పైగా ఆయన మీద ఉన్న మోజుకు కూడా మొదటి ఎన్నిక అది. అంతలా ఆయన నేనే సీఎం అభ్యర్ధి నాకే మీరు ఓట్లు వేయండి అని చెప్పినా ఆరు శాతమే ఓటింగ్ వచ్చింది అంటే 2024 నాటికి ఎందుకు పాతిక శాతం ఓట్లు వస్తాయి అవి ఎక్కడ నుంచి వస్తాయి అన్నది కూడా చూడాల్సిన అంశం.

ఏపీలో వైసీపీ టీడీపీ రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు బాగా బలహీన పడితేనే తప్ప ఓట్ల షేర్ వేరే పార్టీలకు టర్న్ కాదు. ఏపీలో టీడీపీ ఓటు బ్యాంకే ఎక్కువగా జనసేనకు టర్న్ అయ్యే చాన్స్ ఎపుడూ ఉంటుంది. వైసీపీ ఓటు బ్యాంక్ జనసేనకు మళ్లడం కొంత కష్టమైన విషయం. ఇక టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. తన ఓటు షేర్ వచ్చే ఎన్నికల్లో పెరుగుతుంది అని ఆ పార్టీ చెప్పుకుంటోంది. మరి ఆ విధంగా చూస్తే జనసేనకు బలం ఎక్కడ నుంచి వస్తుంది. అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు కూడా మెజారిటీ టీడీపీకే టర్న్ అవుతాయి అన్న విశ్లేషణలు ఉన్నాయి.

మరో వైపు చూస్తే బలమైన కాపు ఓట్లు జనసేనకు పోలరైజ్ అవుతాయని లెక్కలేసుకున్నా అమీ తుమీ తేల్చుకున్న 2009 ఎన్నికలు పైగా మెగాస్టార్ చిరంజీవి పవన్ ఇద్దరూ కలసి కుమ్మేసిన ఆ ఎన్నికల్లో 18 శాతం కంటే ఎక్కువగా ప్రజారాజ్యానికి ఓట్ల షేర్ రాలేదు కదా అన్న గత కాలపు లెక్కలు ఉన్నాయి. పైగా ముక్కోణపు పోరు జరిగితే పాతిక శాతం ఓట్లు జనసేన పట్టుకెళ్లగలదా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా జనసేన బలం పెరిగింది. అయితే అది ఎంత అన్నది తేలాల్సి ఉంది. అలగే టీడీపీ ఓట్ల షేర్ ఈసారి ఎంత అన్నది కూడా చూడాలి. వైసీపీ చెబుతున్న 65 శాతం ఓట్ల షేర్ పక్కన పెట్టి గతంలో వచ్చిన 50 శాతం ఓట్ల షేర్ అలా నిలకడగా ఉంటుందా అన్నది కూడా చూడాలి. వీటన్నిటికీ వచ్చే ఎన్నికలలో జనం ఇచ్చే తీర్పే సరైన సమాధానం.