Begin typing your search above and press return to search.

గెలుపు ఏమో కానీ సీఎం ప్ర‌మాణం డేట్లు చెప్పేస్తున్నారే!

By:  Tupaki Desk   |   30 April 2018 5:14 AM GMT
గెలుపు ఏమో కానీ సీఎం ప్ర‌మాణం డేట్లు చెప్పేస్తున్నారే!
X
మ‌రే రాష్ట్రంలోనూ క‌నిపించ‌ని చిత్ర‌మైన వ్య‌వ‌హారం ఒక‌టి క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చోటు చేసుకుంటోంది. ఓప‌క్క వాడీవేడిగా ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రుగుతున్నా.. అంతిమంగా ఎవ‌రు గెలిచే అవ‌కాశం ఉంద‌న్న విష‌యంపై ఎంత‌కూ క్లారిటీ రాని వైనం తెలిసిందే. ఎవ‌రికి వారు గెలుపు ధీమా ప్ర‌ద‌ర్శించినా.. అంతిమంగా విజేత ఎవ‌ర‌న్న దానిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు సాగుతున్నాయి.

మీడియా చేప‌ట్టిన స‌ర్వేల్లోనూ గెలుపు ఫ‌లానా వారిద‌న్న‌ది ఒక ప‌ట్టాన తేల‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అత్య‌ధిక సీట్లు గెలుచుకునే అవ‌కాశం కాంగ్రెస్‌కు ఉన్నా.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేంత బ‌లం కాంగ్రెస్ సొంతమ‌వుతుందా? అన్న‌ది సందేహంగా మారింది. ఇలాంటివేళ‌.. ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు త‌మ‌దేన‌ని చెప్పుకోవ‌ట‌మే కాదు.. ఎన్నిక‌ల అనంత‌రం త‌మ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి రానుందంటూ చేస్తున్న ట్రిక్కులు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి.

గెలుపు మీద ధీమాను ప్ర‌ద‌ర్శించ‌టం ద్వారా.. కొంద‌రు ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే జిమ్మిక్కు ఒకటి మొహ‌మాటం లేకుండా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తానే కాబోయే క‌ర్ణాట‌క సీఎం అంటూ ముఖ్య‌నేత‌లు త‌మ‌కు తాము గొప్ప‌లు చెప్పుకోవ‌ట‌మేకాదు.. ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం డేట్‌ ను కూడా ప్ర‌క‌టించ‌టం ప‌లువురిని విస్మ‌యానికి గురి చేస్తోంది.

ఈ తీరును ఏ ఒక్క పార్టీనో కాకుండా.. అన్ని ప్ర‌ధాన పార్టీల ముఖ్య‌నేత‌ల నోటి నుంచి ఇదే త‌ర‌హా మాట రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఓట‌మి ప‌క్కా అని.. బీజేపీ గెలుపు త‌థ్య‌మ‌ని చెబుతూ.. మే 17 లేదంటే 18 తేదీన తాను సీఎంగా ప్ర‌మాణస్వీకారం చేస్తాన‌ని.. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోడీ హాజ‌ర‌వుతార‌ని చెబుతున్నారు య‌డ్యుర‌ప్ప‌. అంతేనా.. తన ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం వెన్యూ కూడా చెప్పేస్తున్నారు య‌డ్డీ. త‌న ప్ర‌మాణం కంఠీర‌వ స్టేడియంలో ఉంటుంద‌ని చెబుతున్నారు.

య‌డ్డి మాట‌లు ఇలా ఉంటే.. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌కు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న సిద్ద‌రామ‌య్య సైతం ఏ మాత్రం త‌గ్గ‌కుండా తాను బ‌రిలో ఉన్న రెండు స్థానాల్లోనూ భారీ మెజార్టీతో విజ‌యాన్ని సాధిస్తామ‌ని.. మ‌ళ్లీ తామే ప‌వ‌ర్లోకి వ‌చ్చామ‌ని చెప్ప‌ట‌మే కాదు.. ఫ‌లితాలు విడుద‌లైన వారంలోపే తాను సీఎంగా మ‌రోసారి బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు సిద్ద‌రామ‌య్య ప్ర‌క‌టిస్తున్నారు.

య‌డ్యుర‌ప్ప‌.. సిద్ద‌రామ‌య్య‌ల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో జేడీఎస్ నేత కుమార‌స్వామి కూడా న‌మ్మ‌కంగా చెబుతున్నారు. క‌ర్ణాట‌క ఎన్నికల్లో త‌మ పార్టీ గెలుపు ప‌క్కా అని.. త‌మ గెలుపును త‌న తండ్రికి పుట్టిన‌రోజు కానుక‌గా తాను అంద‌జేస్తాన‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నారు కుమార‌స్వామి. త‌న తండ్రి పుట్టిన‌రోజైన మే 18న తాను ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాన‌ని.. అదే త‌న తండ్రికి తానిచ్చే గిఫ్ట్ గా గొప్ప‌గా చెప్పుకుంటున్నారు కుమార‌స్వామి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఎవ‌రికి వారు తామే సీఎం అంటూ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు.. ప్ర‌మాణ స్వీకారోత్స‌వం ఫ‌లానా రోజున అంటూ చెబుతున్న వైనం ఓట‌ర్ల‌ను విస్తుపోయేలా చేస్తోంది.