Begin typing your search above and press return to search.

అధికార ప‌క్షానికి వార్నింగ్ ఇచ్చేసిన య‌డ్డీ!

By:  Tupaki Desk   |   14 May 2019 5:23 AM GMT
అధికార ప‌క్షానికి వార్నింగ్ ఇచ్చేసిన య‌డ్డీ!
X
మ‌హా అయితే మ‌రో ప‌ది రోజులు. ఈ నెల 23న ఈ క‌థ‌నాన్ని చ‌దివే స‌మ‌యానికి మోడీ భ‌విష్య‌త్ ఏమిటో? ఫ్యూచ‌ర్ ప్ర‌ధాని ఎవ‌ర‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేయ‌ట‌మే కాదు.. కొన్ని రాష్ట్రాల‌కు జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల మీద స్ప‌ష్ట‌త రానుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేంద్రంలో కొలువు తీరే ప్ర‌భుత్వానికి త‌గ్గ‌ట్లు కొన్ని రాష్ట్రాల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మార్పులు చేసుకునే వీలుంద‌ని చెబుతున్నారు.

ప‌శ్చిమ‌బెంగాల్ లో ఏర్పాటు చేసిన ఎన్నిక‌ల స‌భ‌లో మాట్లాడిన ప్ర‌ధాని మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌టం మ‌ర్చిపోకూడ‌దు. మే 23న వ‌చ్చే ఫ‌లితాల త‌ర్వాత బెంగాల్ లో రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌ని చెబుతూ.. 40 మంది ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్న‌ట్లుగా చెప్పారు. మ‌ళ్లీ మోడీ చేతికి అధికారం వ‌చ్చి.. బెంగాల్ లో గ‌తం కంటే ఎక్కువ సీట్లు వ‌స్తే ప్ర‌భుత్వం మారిపోయినా ఆశ్చ‌ర్యం లేద‌ని చెబుతున్నారు.

ఆ మాట‌కు వ‌స్తే ఒక్క బెంగాల్ లోనే కాదు.. క‌ర్ణాట‌క‌తో పాటు మ‌రికొన్ని రాష్ట్రాల రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా కర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి య‌డ్యూర‌ప్ప వ్యాఖ్య‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత రాష్ట్ర రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చని.. స‌త్తా ఉంటే కాంగ్రెస్‌.. జేడీఎస్ నేత‌లు వారి ఎమ్మెల్యేల‌ను దాచిపెట్టుకోవాల‌న్న హెచ్చ‌రిక‌తో కూడిన స‌వాల్ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఫ‌లితాల త‌ర్వాత సీఎం అవుతాన‌ని తాను చెప్ప‌లేద‌ని.. అయితే ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చంటూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్‌.. జేడీఎస్ నేత‌లకు ద‌మ్ముంటే వారి ఎమ్మెల్యేలు జారిపోకుండా గ‌ట్టిగా ప‌ట్టుకోవాల‌న్నారు. లోక్ స‌భ.. అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కుమార‌స్వామి స‌ర్కారు మ‌నుగ‌డ క‌ష్టమేన‌న్నారు. ఎంపీ ఎన్నిక‌ల్లో తాము 22 స్థానాల్లో గెల‌వనున్న‌ట్లుగా వెల్ల‌డించారు. య‌డ్డి మాట‌లు సంకీర్ణ ప్ర‌భుత్వానికి కొత్త గుబులుగా మారాయి. క‌ర్ణాట‌క‌లో బీజేపీ అధిక్య‌త ఖాయ‌మ‌న్న అంచ‌నాలు బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. కేంద్రంలో మోడీ ప‌వ‌ర్లో రాకుంటే త‌ప్పించి కుమార‌స్వామి ప్ర‌భుత్వ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతోంది.