Begin typing your search above and press return to search.

బీఎస్‌ యడియూరప్ప ఎవరంటే?

By:  Tupaki Desk   |   26 July 2019 4:06 PM GMT
బీఎస్‌ యడియూరప్ప ఎవరంటే?
X
పక్క రాష్ట్రం కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో ముఖ్యమంత్రిగా నాల్గోసారి ప్రమాణస్వీకారం చేసిన బీఎస్‌ యడియూరప్ప ప్రస్థానం ప్రభుత్వ ఉద్యోగి నుంచి ప్రభుత్వ ఏర్పాటు దశ వరకు సాగింది. ఈ మధ్యలో ఎన్నో ఆటుపోట్లు చూశారు. జైలు జీవితం అనుభవించారు. రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. రైతుబంధుగా పేరుగాంచారు. బీఎస్‌ యడియూరప్ప 1943 ఫిబ్రవరి 27వ తేదీన సిద్ధలింగయ్య, పుట్టె తాయమ్మ దంపతులకు శివమొగ్గ జిల్లా శికారిపురలో జన్మించారు.

మండ్యలో పీఈఎస్‌ కాలేజీలో చదువు పూర్తి చేశారు. 1965లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి శికారిపురలోని వీరభద్రశాస్త్రి శంకర్‌ రైస్‌ మిల్‌లో గుమస్తాగా చేరారు. అదే సమయంలో 1967లో రైస్‌ మిల్‌ యజమాని కుమార్తె మైత్రాదేవితో వివాహమైంది. అనంతరం 1972లో తొలిసారిగా రాజకీయ రంగప్రవేశం చేశారు. అదే ఏడాది శికారిపుర తాలుకా జనసంఘం అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1975 ఎమర్జెన్సీ పరిస్థితుల్లో 45 రోజుల పాటు బళ్లారి, శివమొగ్గ జైలులో జీవితం అనుభవించారు. తర్వాత 1983లో తొలిసారిగా శాసనసభకు పోటీ చేసి విజయం సాధించారు. 1994లో అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. అలాగే 2007లో బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.

బల నిరూపణలో విఫలమై ఏడు రోజులకే రాజీనామా చేశారు. అనంతరం 2008లో కర్నాటక సీఎంగా ఎన్నికై 2011 వరకు కొనసాగారు. 2018 మే 17వ తేదీ కర్ణాటక సీఎంగా మూడోసారి ప్రమాణం చేశారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోలేక మూడు రోజులకే రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా తాజాగా మరోసారి కర్ణాటక సీఎంగా బీఎస్‌ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. ఈసదర్భంగా తన పేరును యడ్డూరప్ప నుంచి యడియూరప్పగా మార్చుకున్నట్లు తెలిపారు.