Begin typing your search above and press return to search.

అక్కడ ఒక్కో కులానికి ఒక్కో డిప్యూటీ సీఎం?

By:  Tupaki Desk   |   12 Sep 2019 8:00 AM GMT
అక్కడ ఒక్కో కులానికి ఒక్కో డిప్యూటీ సీఎం?
X
కర్ణాటక ప్రభుత్వంలో ఐదుగురికి ఉపముఖ్యమంత్రి పదవులు కట్టబెడుతారని తెలుస్తోంది. బీఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా 17 మందితో కేబినెట్ ఏర్పాటు చేసి అందులో ముగ్గురికి (అశ్వర్థనారాయణ - లక్ష్మణసావది - గోవింద కారజోళ) ఉపముఖ్యమంత్రి పదువులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలు చాలామంది కేబినెట్ పై కన్నేయడంతో అసమ్మతిని తగ్గించేందుకు పదవులు కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్రంలో అతి పెద్ద సముదాయాలుగా ఉన్న ఒక్కళిగ - లింగాయత్ - కురుబ - ఎస్సీ - ఎస్టీలకు చెందిన వారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని భావించారు.

ఈక్రమంలో తొలివిడతలో ముగ్గురు ఉపముఖ్యమంత్రులు ఒక్కళిగ - లింగాయత్ - దళిత సముదాయానికి చెందిన వారే. ఇక మిగిలిన ఎస్టీ - కురుబ సముదాయానికి చెందిన వారికి రెండోవిడతలో అవకాశం కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈమేరకు కర్ణాటకలో అధిక జనాభా అగ్రకులాలకు ఉపముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టే యోచనలో ఉన్నారు. కురుబ సముదాయం నుంచి కేఎస్ ఈశ్వరప్ప - ఎస్టీ వర్గం నుంచి రమేశ్ జార్కిహోళితో పాటు మరికొందరు డిప్యూటీ సీఎం పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.

కర్ణాటక రాష్ట్ర జనాభాలో లింగాయత్ - ఒక్కళిగ - కురుబ - ఎస్సీ - ఎస్టీ సముదాయానికి చెందిన వారు సుమారు 70 శాతం మంది ఉన్నారు.

ఈ క్రమంలో పార్టీ బలోపేతం కావాలంటే ఆయా కులాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి. అంతేకాకుండా ఆయా కులాల్లో బలమైన నాయకులు బీజేపీతో పాటు కాంగ్రెస్ - జేడీఎస్ లో కూడా ఉన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలకు బలహీన పరచాలంటే అగ్ర కులాల వారికి బీజేపీలో ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకోవాలంటే పదవులు కట్టబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని భావిస్తున్నారు. దీనికి తోడు 2008 - 2011 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దగ్గరగా వచ్చి బీజేపీ అందుకోలేకపోయింది. ఈనేపథ్యంలో ఆయా కులాల్లో బలమైన నాయకులకు పదవులు ఇవ్వలేదనే అసమ్మతితో తిరుగుబాటు చేశారని అంచనా వేస్తున్నారు. గతంలో ఫలితాలు పునరావృతం కాకుండా ఉండేందుకు జనాభా ఎక్కువగా ఉన్న కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.