Begin typing your search above and press return to search.

ప్ర‌భుత్వాన్ని మేం కూల్చం...అదే కూలిపోతుంది

By:  Tupaki Desk   |   20 Jan 2019 4:58 AM GMT
ప్ర‌భుత్వాన్ని మేం కూల్చం...అదే కూలిపోతుంది
X
రసవత్తర రాజకీయాలకు చిరునామాగా మారిన కర్ణాటక స‌ర్కారును కూల్చే ఎపిసోడ్ చివ‌రికి ముగింపు ద‌శ‌కు చేరింది. `ఆపరేషన్ కమలం`ప్రస్తుతానికి తెరపడినట్లే! అయితే, అంత‌లోనే మ‌రో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్ర‌భుత్వం త‌నంత తానే ప‌డిపోతుంద‌ని, బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, మాజీ సీఎం యెడ్యూరప్ప ప్రకటించారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూల్చే ఉద్దేశం తమకు లేదంటూనే...ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కర్ణాటకలో తాజా రాజకీయ పరిణామాలపై యెడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ..,ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్-జేడీఎస్‌ ల మధ్య తీవ్ర విభేదాలున్నాయని, శుక్రవారం జరిగిన సీఎల్పీ భేటీకి నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. వచ్చే కొద్ది రోజుల్లో అగ్నిపర్వతం బద్దలవుతుందనేందుకు (ప్రభుత్వం కూలిపోతుందనేందుకు) ఇదే సంకేతమని చెప్పారు. అయితే, కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారును అస్థిరపర్చే ఉద్దేశం తమకు లేదని యెడ్యూరప్ప చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ కు ఎలాంటి భయాలు, అనుమానాలు అక్కర్లేదని అన్నారు. తాము నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ఆయన తెలిపారు. గుర్గావ్‌ లో ఉన్న తమ ఎమ్మెల్యేలంతా బెంగళూరు చేరుకోవాలని యెడ్యూరప్ప ఆదేశించారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న ప్రాంతాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు పర్యటిస్తారని, అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. కేవలం నిరాశ, నిస్పృహలతోనే గైర్హాజరైన ఎమ్మెల్యేలను బెదిరిస్తూ సిద్దరామయ్య వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదన్న యోడ్యూరప్ప నిర్ణయాన్ని మాజీ సీఎం సిద్దరామయ్య స్వాగతించారు.

అయితే, ఈ ఎపిసోడ్‌ కు సీఎం కుమారస్వామి మ‌రో ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం సంకీర్ణ సర్కారు ప్రమాదంలోనే ఉందని, అయితే, దీనిపై తానేమీ వ్యాకులత చెందడంలేదని సీఎం కుమారస్వామి చెప్పారు. ``రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఉంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు వారు (బీజేపీ) శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీనిపై నేనేమీ భయపడడం లేదు. అయితే వారి పాచికలు ఎన్నటికీ పారబోవు`` అని చెప్పారు. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల గైర్హాజరు అంశం ఆ పార్టీ అంతర్గత విషయమని చెప్పారు. స్వతంత్ర ఎమ్మెల్యేలను నమ్ముకోవద్దని పలు సందర్భాల్లో కాంగ్రెస్‌కు చెప్పానని, వారిపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపలేమని పేర్కొన్నారు.