Begin typing your search above and press return to search.

క‌న్న‌డ నేల‌లో నెక్ట్స్ స్కెచ్ ఆ ప్ర‌ముఖుడిని అడ్డు తొల‌గించ‌డం!

By:  Tupaki Desk   |   28 July 2019 5:34 AM GMT
క‌న్న‌డ నేల‌లో నెక్ట్స్ స్కెచ్ ఆ ప్ర‌ముఖుడిని అడ్డు తొల‌గించ‌డం!
X
పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం ఊహించిన మ‌లుపులే తిరిగి...జేడీఎస్‌-కాంగ్రెస్ స‌ర్కారు కుప్ప‌కూలిపోవ‌డం - బీజేపీ గ‌ద్దెనెక్క‌డం తెలిసిన సంగ‌తే. అయితే, ఈ ఎపిసోడ్‌ లో దేశం చూపును ఆక‌ర్షించిన వారిగా న‌లుగురు నేత‌ల‌ను చెప్పుకోవ‌చ్చు. మొద‌టిది సీఎం కుమార‌స్వామి - రెండోది బీజేపీ నేత యెడియుర‌ప్ప‌ - మూడోది కాంగ్రెస్ నేత డీకే శివ‌కుమార్..నాలుగోది స్పీకర్ రమేశ్‌ కుమార్. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా కాషాయ పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు . ప్రభుత్వం పడిపోకుండా నెలరోజులపాటు కాపాడారు. విశ్వాస పరీక్షలో సంకీర్ణ సర్కార్ పతనాన్ని వీలైనంత వ‌ర‌కు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, అందుకే ఇప్పుడు ఆయ‌న టార్గెట్ అయ్యారు.

కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయిన 24 గంటల్లోనే స్పీకర్ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. మిగతా అసమ్మతి ఎమ్మెల్యేల పిటిషన్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పారు. దీంతో బీజేపీకి భయం పట్టుకుంది. ఒకవేళ స్పీకర్ ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేస్తే బీజేపీ - కాంగ్రెస్-జేడీఎస్ కూటములు మ్యాజిక్ ఫిగర్‌ కు ఒకటి రెండు స్థానాలు అటుఇటుగా ఉంటాయి. ఇదే జరిగితే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమని బీజేపీకి తెలుసు. ఈ నేపథ్యంలోనే స్పీకర్‌ ను మార్చాలని కనిపిస్తున్నట్టు సమాచారం. ఈ నేప‌థ్యంలోనే, సంకీర్ణ స‌ర్కారును కూల్చి ముఖ్యమంత్రిగా శనివారం ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యెడియూరప్ప కొత్త గోల్ పెట్టుకున్నారని అంటున్నారు.

యెడియూర‌ప్ప‌ త‌న దృష్టి మంత్రివర్గ కూర్పు కన్నా.. స్పీకర్ రమేశ్‌ కుమార్ పైనే ఎక్కువగా ఉంది. గత అనుభవాలకు ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు భవిష్యత్తులో తన ప్రభుత్వానికి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే రమేశ్‌ కుమార్‌ ను గద్దె దింపాల్సిందేనని సీఎం భావిస్తున్నట్టు జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. ``మా దృష్టి మొత్తం సోమవారం జరుగనున్న బలపరీక్ష మీదే ఉంది. ఆలోగా స్పీకర్ స్వచ్ఛందంగా తప్పుకుంటారేమో చూద్దాం. లేకుంటే మేం బలపరీక్షలో నెగ్గిన తర్వాత.. స్పీకర్‌ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తున్నాం`` అని బీజేపీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.