Begin typing your search above and press return to search.

య‌డ్డీ - ఏడుపు!...క‌న్న‌డ‌నాట‌ రిపీటెడ్ సీన్స్‌!

By:  Tupaki Desk   |   25 May 2018 10:50 AM GMT
య‌డ్డీ - ఏడుపు!...క‌న్న‌డ‌నాట‌ రిపీటెడ్ సీన్స్‌!
X
క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత దేశ‌మంతా ఆ రాష్ట్రంలో నిమిష నిమిషానికి మారుతున్న ప‌రిణామాణాల‌ను ఆస‌క్తిగా ప‌రిశీలిస్తోంది. త‌మ‌కు ఏమాత్రం సంబంధం లేని ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌లు, ఆ త‌ర్వాత వ‌రుస‌గా చోటుచేసుకుంటున్న ప‌రిణామాల‌ను దేశంలోని 28 రాష్ట్రాల ప్ర‌జ‌లు చాలా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. అంత‌గా దేశ ప్ర‌జలందరి దృష్టిని ఆకర్షించిన క‌న్న‌డ రాజ‌కీయాల్లో ఇప్పుడు సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా మారిన వ్య‌క్తి ఎవ‌ర‌న్న విష‌యానికి వ‌స్తే... ముమ్మాటికీ బీజేపీ క‌ర్ణాట‌క శాఖ అధ్య‌క్షుడు - ఆ రాష్ట్ర మాజీ సీఎం - మొన్న‌టికి మొన్న తీన్ దిన్ కా సుల్తాన్‌ గా మారిన బీఎస్ య‌డ్యూర‌ప్పేన‌ని చెప్పాలి. అస‌లు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో తానే కింగ్ మేక‌ర్‌ న‌ని చెప్పుకున్న జేడీఎస్ నేత కుమార‌స్వామి, ఇప్పుడు ఏకంగా కింగే అయినా కూడా య‌డ్డీనే అంద‌రి దృష్టిని ఆకర్షించిన నేత‌గా చెప్పుకోవాలి.

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్‌ గా ప‌రిగ‌ణించిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాక ముందు నుంచీ బీజేపీ... చావో, రేవో అన్న చందంగా ముందుకు సాగింది. మందీ మార్బ‌లాన్ని దించేసిన బీజేపీ... వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రించింద‌ని చెప్పాలి. రెండేళ్ల ముందు నుంచి ప‌క్కా ప్లాన్‌ తో ముందుకు సాగిన బీజేపీ... ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా హేమాహేమీల‌ను రంగంలోకి దించింది. అయితే... ఈ మొత్తం వ్య‌వ‌హారం య‌డ్డీ సెంట్రిక్‌ గానే జ‌రిగింద‌ని చెప్పాలి. ఎందుకంటే.... య‌డ్డీనే బీజేపీ క‌ర్ణాట‌క శాఖ అధ్య‌క్షుడిగా ఉన్నారు కాబ‌ట్టి. అంతేకాకుండా త‌న‌దాకా వ‌స్తే ఎంత‌కైనా తెగించే ర‌క‌మ‌న్న ముద్ర వేసుకున్న య‌డ్డీ మిన‌హా... బీజేపీకి సీఎంగా కేండిడేట్‌ గా ప్ర‌త్యామ్నాయం లేక‌పోయింది. దీంతో య‌డ్డీనే త‌న సీఎం కేండిడేట్‌ గా ప్ర‌క‌టించేసింది.

అయితే ఊహించ‌ని విధంగా ఎన్నిక‌ల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచినా... య‌డ్డీకి అధికార దండం అంద‌లేదు క‌దా... అవ‌మానాలు ఎదుర‌య్యాయి. మెజారిటీ ఎమ్మెల్యేలు లేకుండానే సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన య‌డ్డీ... ఇత‌ర పార్టీ ఎమ్మెల్యేల‌ను రాబ‌ట్టడంలో మాత్రం స‌క్సెస్ కాలేదు. దీంతో సీట్లో కూర్చున్న మూడు రోజుల‌కే ఆయ‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది. అంతేనా... బ‌ల‌ప‌రీక్ష‌కు ముందే చేతులెత్తేసిన య‌డ్డీ... నిజంగా అభాసుపాల‌య్యార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... య‌డ్డీ - ఏడుపు ఇప్పుడు క‌న్న‌డ‌నాట య‌మా పాపుల‌ర్ జోడీ ప‌దాలు అయ్యాయి. మొన్న‌టికి మొన్న త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసే స‌మ‌యంలో అసెంబ్లీలో ప్ర‌సంగించిన సంద‌ర్భంగా య‌డ్డీ ఏడుపు లంకించుకున్నారు. క‌న్నీళ్లు తుడుచుకుంటూ ఆయ‌న చేసిన ప్ర‌సంగం జేడీఎస్‌ - కాంగ్రెస్ సభ్యుల‌కు న‌వ్వులు తెప్పించింది.

తాజాగా కుమార‌స్వామి బ‌ల‌ప‌రీక్ష సంద‌ర్భంగానూ జ‌రిగిన చ‌ర్చ‌లో పాలుపంచుకున్న య‌డ్డీ... మొన్న‌టిమాదిరే దాదాపుగా ఏడ్చేసినంత ప‌నిచేశారు. క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు త‌మ‌నే గెలిపించార‌ని, అయినా కూడా తాము సాధించిన సీట్ల‌లో మూడో వంతు సీట్లు సాధించిన పార్టీకి చెందిన కుమార సీఎం కావ‌డం ఏమిటో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని ఆయ‌న గ‌ద్గ‌ద స్వ‌రంతో ప్ర‌సంగించ‌డం స‌భ‌లో న‌వ్వులు పూయించింది. జేడీఎస్ - కాంగ్రెస్ ల‌పై నిప్పులు చెరుగుతూ చేసిన ప్ర‌సంగంలో య‌డ్డీ కంట‌త‌డి - ఒణికిన గొంతు - ప‌ద‌వి ద‌క్క‌లేద‌న్న అక్క‌సు స్ప‌ష్టంగా క‌నిపించాయి. మొత్తంగా అధికారం త‌మ‌దేన‌ని విర్ర‌వీగిన య‌డ్డీ... ఇక ఏడుపే దిక్క‌యిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.