Begin typing your search above and press return to search.

హోం క్వారంటైన్‌ లోకి వృద్ధ ముఖ్య‌మంత్రి

By:  Tupaki Desk   |   10 July 2020 3:00 PM GMT
హోం క్వారంటైన్‌ లోకి వృద్ధ ముఖ్య‌మంత్రి
X
వైర‌స్ కట్టడిలో ముందు వరుసలో ఉన్న రాష్ట్రం క‌ర్నాట‌క‌. కేంద్ర ప్ర‌భుత్వం చేత ప్ర‌శంస‌లు పొందిన‌ది కూడా. అయినా ఆ రాష్ట్రంలో వైర‌స్ తీవ్రంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా బెంగ‌ళూరులో ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో 77 ఏళ్ల ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప హోం క్వారంటైన్ వెళ్తున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా శుక్రారం ప్ర‌క‌టించారు.

ఆయ‌న వ్య‌క్తిగ‌త సిబ్బందిలో చాలామందికి వైర‌స్ సోక‌డంతో య‌డ్యూర‌ప్ప అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ముందు జాగ్ర‌త్త‌లో భాగంగా హోం క్వారంటైన్‌లో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. కొద్ది రోజుల పాటు ఇంటి నుంచే పని చేయనున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. వైర‌స్ పరిస్థితిపై బెంగళూరు మహానగర పాలిక సహా మొత్తం 198 మంది కార్పొరేటర్లతో సీఎం యడ్యూరప్ప శుక్ర‌వారం సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే ఆయన వద్ద పనిచేసే సిబ్బందిలో కొందరికి పాజిటివ్ తేల‌డంతో ఆ స‌మావేశం ర‌ద్ద‌య్యింది.

చాలా మందికి వైర‌స్ సోక‌డంతో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని మూసివేశారు. పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ముందు జాగ్రత్త చర్యగా తాను ఇంటి నుంచి పని చేయనున్నట్లు సీఎం యడ్యూరప్ప ప్ర‌క‌టించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ముందు జాగ్రత్త కోసం ఇంటి నుంచి పని చేస్తున్నట్లు ట్వీట్టర్ లో తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్రజలెవరూ భయమపడవద్దని విజ్ఞప్తి చేశారు. హోం క్వారంటైన్‌లో ఉన్నా ఆన్‌లైన్‌ ద్వారా సలహాలు, సూచనలు అందిస్తానని పేర్కొన్నారు. నిబంధనలు.. జాగ్ర‌త్త‌లు పాటించి వైర‌స్ వ్యాప్తిని అరికట్టాలని సీఎం యడ్యూరప్ప పిలుపునిచ్చారు.