Begin typing your search above and press return to search.

ఎల్లారెడ్డి కాంగ్రెస్ స‌భ‌.. ఆప‌రేష‌న్ స‌క్సెస్‌.. పేషెంట్ డెడ్‌..!

By:  Tupaki Desk   |   24 March 2022 4:33 AM GMT
ఎల్లారెడ్డి కాంగ్రెస్ స‌భ‌.. ఆప‌రేష‌న్ స‌క్సెస్‌.. పేషెంట్ డెడ్‌..!
X
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో రెండు రోజుల క్రితం కాంగ్రెస్ మ‌న ఊరు మ‌న పోరు కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ స‌భ‌కు పెద్ద ఎత్తున శ్రేణులు హాజ‌ర‌య్యారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉన్న మెద‌క్‌, జ‌హీరాబాద్ పార్ల‌మెంటు పరిధిలోని ప్ర‌జ‌లు కూడా ఈ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. ఊహించిన దానికంటే ఈ స‌భ స‌క్సెస్ కావ‌డంతో పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే ఎప్ప‌టిలాగానే కాంగ్రెస్ లో ఉన్న గ్రూపు త‌గాదాలు ఇక్క‌డా బ‌య‌ట‌ప‌డ్డాయి. ఢిల్లీ నుంచి గ‌ల్లీ దాకా వేధిస్తున్న వ‌ర్గ పోరు స‌మ‌స్య ఇక్క‌డా చోటుచేసుకుంది. రెండు వ‌ర్గాల నేత‌లు ఫ్లెక్సీలు చింపివేశారు. చివ‌ర‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌట‌ట్ల‌ను కూడా ధ్వంసం చేశారు. దీంతో రేవంత్ తీవ్ర ఆగ్ర‌హం చేశార‌ట‌. బాధ్యుల‌ను గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా నేత‌ల‌ను ఆదేశించార‌ట‌. స‌భ విజ‌య‌వంతమైనా వ‌ర్గ పోరుతో ఆప‌రేష‌న్ స‌క్సెస్‌.. పేషెంట్ డెడ్ లా మారింద‌ని శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

ఈ ఘ‌ట‌న మూలాలు గ‌మ‌నిస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూశాయి. తొలుత ఈ కార్య‌క్ర‌మ బాధ్య‌త‌ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి వ‌డ్డేప‌ల్లి సుభాష్ రెడ్డి తీసుకున్నారు. రేవంత్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచీ ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉంటూ నియోజ‌క‌వ‌ర్గం మొత్తం క‌లియ‌దిరుగుతున్నారు సుభాష్ రెడ్డి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి టికెట్ ఆశిస్తున్న ఆయ‌న అందుకు త‌గిన విధంగా త‌న వ‌ర్గాన్ని స‌మాయ‌త్తం చేసుకుంటున్నారు. సుభాష్ రెడ్డి రేవంత్ అనుచ‌రుడు కూడా కావ‌డం ఆయ‌న‌కు క‌లిసొచ్చే అంశం.

టీడీపీలో ఉన్న సుభాష్ రెడ్డి 2017లో రేవంతుతో పాటు కాంగ్రెస్ లో చేరారు. అప్పుడే ఆయ‌న ఎల్లారెడ్డి టికెట్ హామీతో చేరారు. క్రితం ఎన్నిక‌ల్లో టికెట్ కోసం చివ‌రి వ‌ర‌కు ప్ర‌య‌త్నించారు. అయితే అప్ప‌టి అధ్య‌క్షుడు ఉత్త‌మ్ రేవంత్ వ‌ర్గాన్ని అడ్డుకొని జాజాల సురేంద‌ర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. ఆయ‌న కాస్తా ఇక్క‌డి నుంచి గెలిచి త‌ద‌నంత‌రం టీఆర్ఎస్ లో చేరారు. అయితే ఇపుడు పీసీసీ చీఫ్‌గా రేవంత్ ఉండ‌డంతో టికెట్ త‌న‌కే వ‌స్తుంద‌న్న ధీమాతో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నిచేసుకుపోతున్నారు సుభాష్ రెడ్డి.

అయితే.. ఇక్క‌డే మ‌రొక చిక్కు వ‌చ్చి ప‌డింది. క్రితం ఎన్నిక‌ల్లో జ‌హీరాబాద్ ఎంపీగా పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓడిన మ‌ద‌న్ మోహ‌న్ రావు క‌న్ను కూడా ఇపుడు ఎల్లారెడ్డిపై ప‌డింద‌ట‌. ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం జ‌హీరాబాద్ పార్ల‌మెంటు ప‌రిధిలోకి వ‌స్తుండ‌డంతో మ‌ద‌న్ మోహ‌న్ రావు త‌న పాత ప‌రిచ‌యాల ఆధారంగా ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. ఆ మేర‌కు మొన్న‌టి స‌భ బాధ్య‌త‌లు ఆయ‌న కూడా తీసుకున్నార‌ట‌.

అయితే ఇక్క‌డే పెద్ద గొడ‌వ చెల‌రేగింది. స‌భ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి మ‌ద‌న్ అనుచ‌రులు టీఆర్ ఎస్ కు చెందిన వాహ‌నంలో రావ‌డం విశేషం. ఈ వాహ‌నం మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ కు చెందిన‌దిగా భావిస్తున్నారు. దీంతో ఇరు వ‌ర్గాలు ఘ‌ర్ష‌ణ ప‌డ్డాయి. ఒక‌రి ఫ్లెక్సీలు మ‌రొక‌రు చించేసుకున్నారు. మ‌ద‌న్ మోహ‌న్ ఎర్ర‌బెల్లికి స్వ‌యానా అల్లుడు కావ‌డం గ‌మ‌నార్హం. రేవంతు మ‌ద్ద‌తు సుభాష్ రెడ్డికే ఉండ‌డంతో టీఆర్ఎస్ వ‌ర్గాల మ‌ద్ద‌తు ఉన్న మ‌ద‌న్ మోహ‌న్ రావు ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు ఫ‌లిస్తాయో వేచి చూడాలి.