Begin typing your search above and press return to search.

పించన్ల పై ఎల్లో మీడియా అసత్యాలు ... సీఎం జగన్ ఫైర్ !

By:  Tupaki Desk   |   4 Dec 2020 11:51 AM GMT
పించన్ల పై ఎల్లో మీడియా అసత్యాలు ... సీఎం జగన్ ఫైర్ !
X
ఏపీలో శీతాకాలం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. వైసీపీ , టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ముఖ్యంగా పింఛన్ల విషయంలో అసెంబ్లీ అట్టుడుకుతోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా టీడీపీ వ్యవహరించిన తీరుపై స్పీకర్‌ తమ్మినేని , సీఎం జగన్‌ కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు. టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, వాటిని ఎల్లో మీడియా బ్యానర్లు వేయడంపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల వ్యవహారంపై నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, టీడీపీ సభ్యుల ప్రవర్తన, అసెంబ్లీ ముగిశాక చంద్రబాబు స్పందించిన తీరుపై ఇవాళ పత్రికల్లో పలు వార్తలు వచ్చాయి. వీటిని అసెంబ్లీలో ప్రస్తావించిన మంత్రి కన్నబాబు టీడీపీ తీరుపై విరుచుకుపడ్డారు.

టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ నే బెదిరించేలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. టీడీపీ సభ్యుల ప్రవర్తన నానాటికీ హద్దులు దాటుతోందన్నారు. అనంతరం ఇదే అంశంపై స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ...అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తన దారుణంగా ఉంటోందన్నారు. ఇలాంటి ప్రవర్తనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న నిర్ణయాన్ని సభా నాయకుడైన సీఎం జగన్ ‌కే వదిలిపెడుతున్నామన్నారు. ఆ తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ .. పించన్ల వ్యవహారంపై అసెంబ్లీ, బయట టీడీపీ ఎమ్మెల్యేలు, చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఎల్లో మీడియా అసత్యాలు ప్రచురించిందని మండిపడ్డారు. స్పీకర్ పోడియం వద్దకు సభ్యులను పంపి గందరగోళం సృష్టిస్తున్నారని, సభ నుంచి సస్పెండ్‌ చేయించుకుని కొన్ని మీడియా సంస్ధలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు.

ఎల్లో మీడియాలో తమ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయిస్తున్నారని సీఎం జగన్‌ విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కేవలం ఎన్నికల ముందు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని, అప్పుడే పింఛన్లు పెంచుతారని, డబ్బులిస్తారని జగన్ విమర్శించారు. తమకు మాత్రం ఎన్నికలు అయిన వెంటనే ప్రజలు గుర్తుకు వస్తారని చెప్పారు. అలాగే, ఇచ్చిన మాట ప్రకారం జూలై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆసరా పెన్షన్లను రూ.2250 నుంచి రూ.2500కు పెంచుతామని ప్రకటించారు. అలా రూ.3000కు పెంచుతామని జగన్ స్పష్టం చేశారు.