Begin typing your search above and press return to search.

కోదండ‌రాం జైలుకు వెళ్ల‌లేదు..పార్టీ ఎలా పెడ‌తావు?!

By:  Tupaki Desk   |   8 Feb 2018 4:12 PM GMT
కోదండ‌రాం జైలుకు వెళ్ల‌లేదు..పార్టీ ఎలా పెడ‌తావు?!
X
తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్‌ కోదండ‌రాంకు రాజ‌కీయ పార్టీ ఏర్పాటుకు ముందే... ప్ర‌శ్న‌లు మొద‌లవుతున్నాయి. ఆయ‌న ఉద్య‌మ ప్ర‌స్థానంపై నిల‌దీత‌లు రెడీ అవుతున్నాయి. ఇప్ప‌టికే అధికార ప‌క్ష‌మైన టీఆర్ ఎస్ పార్టీ ఆయ‌న‌పై ఎదురుదాడి చేస్తుండ‌గా...ఈ జాబితాలోకి తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా పాల్గొన్న శ‌క్తులు తోడ‌య్యాయి. టీఆర్ ఎస్ పార్టీ పొలిట్‌ బ్యూరో స‌భ్యునిగా కొన‌సాగి..అనంత‌రం బీజేపీలో చేరి ఆ త‌ర్వాత ఆ పార్టీకి దూర‌మైన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలంగా జేఏసీ చైర్మ‌న్‌ పై మండిప‌డ్డారు.

టీఆర్ ఎస్ పార్టీ స‌భ్యునిగా ఉండి గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి దూర‌మైన చెరుకు సుధాక‌ర్ సార‌థ్యంలోని తెలంగాణ ఇంటిపార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న యొన్నం శ్రీ‌నివాస్‌ రెడ్డి తాజాగా జేఏసీ చైర్మ‌న్ తీరును త‌ప్పుప‌ట్టారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరమనే విష‌యాన్ని ఇంటి పార్టీ ఎప్పుడో చెప్పిందని ఆయ‌న గుర్తు చేశారు. జేఏసీ రూపంలో కోదండరాం ఉద్యమాలు చేస్తూ వచ్చారు కానీ ఎవరిని కలుపుకొని పోలేదని ఆరోపించారు. ఉద్యమం చేసిన వారిని కాకుండా...ఒక ఇద్దరు - ముగ్గురు బఫూన్ల‌ను పక్క పెట్టుకొని పార్టీ పెడుతామంటే ఎలా అని యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి ప్ర‌శ్నించారు.

తెలంగాణ ఇంటి పార్టీ అధ్య‌క్షుడైన చెరుకు సుధాకర్ కంటే ఎక్కువ ఉద్యమం ఎవరు చేయలేదని యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. పీడీ యాక్ట్ కేసులతో జైళ్లలో ఉన్నారని తెలిపారు. `కోదండరాం గారు మీరు ఉద్యమంలో జైళ్లలో ఉన్నారా ..! కోదండరాం ఒకరే పార్టీ నడుపలేరు..!ఉద్యమం చేసిన అనుభవం ఉంది కానీ రాజకీయ పార్టీ అనుభవం లేదు. ఇప్పటికైనా పార్టీ పెట్టే ముందు ఉద్యమకారులందరితో సంప్రదింపులు జరపాలి...!` అని ఆయ‌న సూచించారు.