Begin typing your search above and press return to search.

అనిల్ అంబానీ చాప్టర్ క్లోజేనా?... బ్యాంకుల చేతికి హెడ్డాఫీస్

By:  Tupaki Desk   |   30 July 2020 4:30 PM GMT
అనిల్ అంబానీ చాప్టర్ క్లోజేనా?... బ్యాంకుల చేతికి హెడ్డాఫీస్
X
భారత పారిశ్రామిక రంగంలో తనదైన రేంజిలో ఎదిగిన అంబానీ ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు ఓ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ధీరూభాయ్ అంబానీ కుమారుల్లో పెద్దోడైన ముఖేశ్ అంబానీ... అంతకంతకూ ఎదిగిపోతూ ఉంటే... చిన్న కుమారుడు అనిల్ అంబానీ పూర్తి పతానావస్థకు చేరుకున్నాడనే చెప్పాలి. ధీరూభాయ్ స్థాపించిన రిలయన్స్ వ్యాపారాల్లో ముఖేశ్, అనిల్ లకు సరిసమానంగా వాటాలు దక్కినా.. వాటిని నిలబెట్టుకునే విషయంలో ముఖేశ్ సత్తా చాటితే.. అనిల్ మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ఇప్పటికే దాదాపుగా కంపెనీలన్నీ మూసివేసుకునే స్థితికి చేరుకున్న అనిల్ కు ఇప్పుడు మరో భారీ ఎదురు దెబ్బ తప్పడం లేదు. అనిల్ నేతృత్వంలోని అడాగ్ హెడ్డాఫీస్ ను అప్పుల కింద బ్యాంకులు స్వాదీనం చేసుకోనున్నాయి. ఇదే జరిగితే.. అనిల్ చాప్టర్ క్లోజేనన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాగ్ పలు బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రూపాయాలను అప్పులుగా తీసుకుంది. అయితే వాటిని తిరిగి చెల్లించే విషయంలో అనిల్ దాదాపుగా చేతులెత్తేశారు. ఈ క్రమంలో ఇచ్చిన అప్పులను రాబట్టుకునేందుకు రంగంలోకి దిగిన బ్యాంకులు... అనిల్ వద్ద ఉన్న ఆస్తులపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే అనిల్ కంపెనీలకు రూ.2,892 కోట్ల మేర అప్పులు ఇచ్చిన యస్ బ్యాంకు... ఆ రుణాన్ని రాబట్టుకునేందుకు ఏకంగా అనిల్ కంపెనీల హెడ్డాఫీస్ నే స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టింది.

ముంబై సౌత్ లో అనిల్ కంపెనీలకు చెందిన హెడ్డాఫీస్ ఉంది. దాదాపు 21 వేల చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణం కలిగిన ఈ కార్యాలయం భారీ ధరే పలుకుతోంది. అయితే తమకు చెల్లించాల్సిన రుణాల విషయంలో అనిల్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో యస్ బ్యాక్ 60 రోజుల క్రితమే అనిల్ హెడ్డాఫీస్ స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు కూడా అనిల్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, 60 రోజుల గడువు కూడా ముగిసిపోవడంలో యస్ బ్యాంక్.. అడాగ్ హెడ్డాఫీస్ ను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైపోయింది. నిర్ణీత గడువు 60 రోజుల సమయం ముగిసిపోయినా... అనిల్ నుంచి స్పందన లేకపోవడంతో ఇక అడాగ్ హెడ్డాఫీస్ ను స్వాధీనం చేసుకోవడం మినహా తమకు మరే ప్రత్యామ్నాయం కనిపించడం లేదని యస్ బ్యాంక్ చెబుతోంది. అదే జరిగితే అనిల్ చాప్టర్ క్లోజేనని చెప్పక తప్పదు.