Begin typing your search above and press return to search.

నిన్న పీకే.. ఇప్పుడు.. మ‌మ‌త‌.. కాంగ్రెస్‌ను ఉతికి ఆరేశారుగా!

By:  Tupaki Desk   |   30 Oct 2021 3:30 PM GMT
నిన్న పీకే.. ఇప్పుడు.. మ‌మ‌త‌.. కాంగ్రెస్‌ను ఉతికి ఆరేశారుగా!
X
నిన్న‌టికి నిన్న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌(పీకే) కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్య‌లుచేశారు. రాహుల్ పుంజుకోవ‌డం లేద‌ని.. బీజేపీపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉన్నా.. అవి కాంగ్రెస్‌ను అనుకూలంగా మార‌డం క‌ష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు. ఇది జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. నిజానికి కాంగ్రెస్‌లో చేర‌తాన‌ని ప్ర‌క‌టించిన పీకే.. ఆ పార్టీ పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో కాంగ్రెస్ సీనియ‌ర్లు కూడా విస్మ‌యం వ్య‌క్తం చేశారు. మోడీ వంటి బ‌ల‌వంతుణ్ని ఢీ కొట్టేందుకు రాహుల్ ఎలాంటి ప్ర‌య‌త్నాలూ చేయ‌డం లేద‌ని.. పీకే చెప్పిన విష‌యం.. ఇప్ప‌టికీ చ‌ర్చ‌నీయాంశంగానే ఉంది. ఇంత‌లో.. పశ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కాంగ్రెస్ కేంద్రంగా మ‌రో బాంబు పేల్చారు.

రాజకీయాల పట్ల కాంగ్రెస్‌ సీరియస్‌గా ఉండట్లేదని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ మరింత శక్తిమంతంగా మారుతున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. గోవా పర్యటనలో ఉన్న దీదీ.. అక్కడ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే అవసరాన్ని కాంగ్రెస్‌ గుర్తించట్లేదని దుయ్యబట్టారు. ఇదే విష‌యాన్ని పీకే చెప్ప‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఆయ‌న‌పై కాంగ్రెస్‌లోని కొంద‌రు నాయ‌కులు విరుచుకుప‌డ్డారు. కానీ, ఇప్పుడు ఫైర్ బ్రాండ్ మ‌మ‌త కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

మ‌మ‌త ఇక్క‌డితో ఆగ‌లేదు.. ``కాంగ్రెస్‌ రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవట్లేదు. ఆ పార్టీ వల్లే మోడీజీ మరింత శక్తిమంతంగా మారుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్‌.. బీజేపీకి టీఆర్‌పీగా మారుతోంది. ఇప్పటికైనా వారు(కాంగ్రెస్‌) నిర్ణయం తీసుకోకపోతే.. యావత్ దేశం బాధపడాల్సి వస్తుంది. వారికి గతంలో ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ, వారు బీజేపీపై పోరాటం చేయాల్సింది మాని.. బెంగాల్ రాష్ట్రంలో నాపై పోటీ చేశారు. అలాంటప్పుడు మేం వారితో ఎలా చేతులు కలపగల్గుతాం`` అని మ‌మ‌త కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

గోవా ఫార్వర్డ్ పార్టీ అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్తో మమత భేటీ అయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపిని ఎదుర్కొనేం దుకు ఇరు పక్షాలు కలిసి పనిచేయాలని ప్రతిపాదించినట్లు దీదీ వెల్లడించారు. ఓట్ల చీలికను తమ పార్టీ నివారించాలని భావిస్తోందని.. దీని వల్ల ప్రాంతీయ పార్టీలకు కూడా బీజేపీపై పోరాడేందుకు అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించారు. 'అచ్చేదిన్' (మంచిరోజులను) తెస్తామన్న కేంద్రం.. ఇప్పుడు దేశాన్ని నాశనం చేస్తోందని ఆరోపించారు. ఇంధన ధరల పెంపు, జీఎస్టీ వ్యాపారాలపై ప్రభావం చూపాయని.. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిందని పేర్కొన్నారు. ఎగుమతులు కూడా క్షీణించాయని తెలిపారు. మొత్తానికి అటు పీకే వ్యాఖ్య‌లు.. ఇటు.. మ‌మ‌త కామెంట్లు కాంగ్రెస్‌ను ఇర‌కాటంలోకి నెట్టాయి. మ‌రి ఏం చేస్తారో చూడాలి.