Begin typing your search above and press return to search.

బుల్ డోజర్లు బయటకు వచ్చే డేట్ చెప్పి యోగి సంచలనం

By:  Tupaki Desk   |   19 Feb 2022 7:30 AM GMT
బుల్ డోజర్లు బయటకు వచ్చే డేట్ చెప్పి యోగి సంచలనం
X
సంచలనాల కోసం ఈ మధ్యన నేతలు చేసే వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి. యూపీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ ఫైట్ మరింత ముదిరిపోవటంతో ఎవరికి తగ్గట్లు వారు నోటికొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అక్కడెక్కడో ఉన్న యూపీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్ లోని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి కలకలాన్ని రేపాయో తెలిసిందే.

యోగికి ఓట్లు వేయని వారిపై బుల్ డోజర్లు పెట్టి తొక్కించేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారటమేకాదు కేంద్ర ఎన్నికల సంఘం సైతం స్పందించి.. వెంటనే వివరణ ఇవ్వాలని రాజాసింగ్ ను ఆదేశించటం తెలిసిందే.

దీంతో బుల్ డోజర్ల మాట రాజకీయ రగడగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా బుల్ డోజర్ల ప్రస్తావనను యూపీ సీఎం యోగి ముందు ప్రస్తావించగా.. ఆయన తనదైన శైలిలో స్పందించారు. బుల్ డోజర్ల మాటను తెలివిగా వాడేస్తూ.. రాష్ట్రంలోని నేరగాళ్లపై తమ ప్రభుత్వం అనుసరించే వైఖరికి అనుగుణంగా మలుచుకున్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బుల్ డోజర్లకు పని చెబుతారా అంటూ తమ రాజకీయ ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ నేత సంధించిన ప్రశ్నాస్త్రానికి స్పందించిన యోగి.. తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని బుల్ డోజర్లు మొత్తాన్ని రిపేర్లకు పంపామని.. మార్చి 10 తర్వాత అన్నీ పని చేస్తాయని చెప్పటం గమనార్హం. ‘మెషిన్లకు కూడా విశ్రాంతి అవసరం కదా? అక్రమ ఆస్తుల విధ్వంసానికి మా ప్రభుత్వం బుల్ డోజర్లను వాడుతుంది.

గడిచిన నాలుగున్నరేళ్లుగా కలుగుల్లో దాక్కొన్న వారంతా ఎన్నికల ప్రకటనతో బయటకు వచ్చి అరుస్తున్నారు’ అంటూ యోగి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. చూస్తుంటే.. యూపీ ఎన్నికలు తమకు అనుకూలంగా వస్తే మాత్రం.. బుల్ డోజర్లు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాయన్న సంకేతాన్ని తన తాజా సందేశంతో ఇచ్చేశారని చెప్పొచ్చు.