Begin typing your search above and press return to search.

రామాల‌యంపై యోగి తాజా వ్యాఖ్య విన్నారా?

By:  Tupaki Desk   |   31 May 2017 4:21 PM GMT
రామాల‌యంపై యోగి తాజా వ్యాఖ్య విన్నారా?
X
యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. గ‌డిచిన ప‌దిహేనేళ్లుగా ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని సాహ‌సానికి తెర తీసిన యోగి.. ఈ రోజు అయోధ్య‌లోని వివాదాస్ప‌ద స్థ‌లంలో ఏర్పాటు చేసిన రామాల‌యాన్ని సంద‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అయోధ్య‌లో రామాల‌యాన్ని తెర మీద‌కు తీసుకొచ్చే ప‌నిలో భాగంగానే ఆయ‌న తాజా ప‌ర్య‌ట‌న ఉంద‌న్న వాద‌న‌కు బ‌లాన్ని చేకూరుస్తూ వ్యాఖ్య‌లు చేశారు.

అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణానికి అవ‌స‌ర‌మైన భూములు ఇచ్చేందుకు చాలా ముస్లిం సంస్థ‌లు సిద్ధంగా ఉన్న‌ట్లుగా వ్యాఖ్యానించారు. చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కారం క‌నుక్కునేందుకు ఇదే స‌రైన స‌మ‌యంగా యోగి అభివ‌ర్ణించారు. రామాల‌య నిర్మాణానికి సానుకూలంగా ఉండే ముస్లిం సంస్థ‌లకు స‌హ‌క‌రించేందుకు యూపీ ప్ర‌భుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంద‌న్నారు.

2013లో విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ప్రారంభించిన 84-కోసి ప‌రిక్ర‌మ యాత్ర‌ను తిరిగి ప్రారంభించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. అప్ప‌ట్లో ఈ యాత్ర‌ను అఖిలేశ్ స‌ర్కారు కొన‌సాగ‌నీయ‌లేద‌ని.. ఇప్పుడు తాము ప్రారంభించనున్న‌ట్లుగా చెప్పారు. వివాదాస్ప‌ద క‌ట్ట‌డం కూల్చివేత‌కు సంబంధించి కుట్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ కోర్టుకు హాజ‌రైన ధ‌ర‌మ్ దాస్‌.. తాజా ప‌ర్య‌ట‌న‌లో సీఎం యోగి వెంట ఉండ‌టం గ‌మ‌నార్హం. రామ‌జ‌న్మ‌భూమి.. బాబ్రీ మ‌సీదు కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆల‌యంలో అర‌గంట‌పాటు గ‌డిపిన యోగి.. స‌ర‌యు న‌ది ఒడ్డున ప్రార్థ‌న‌లు చేశారు. ముందుగా వెలువ‌డిన అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే యోగి.. వివాదాస్ప‌ద స్థ‌లంలో రామాల‌య నిర్మాణానికి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌ట‌మే కాదు.. రామాల‌య నిర్మాణం విష‌యంలో త‌న‌కున్న క‌మిట్ మెంట్ ను ప్ర‌ద‌ర్శించార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/