Begin typing your search above and press return to search.

బెస్ట్ సీఎం యోగీ!... బాబు అడ్రెస్ గ‌ల్లంతు!

By:  Tupaki Desk   |   25 Jan 2019 9:59 AM GMT
బెస్ట్ సీఎం యోగీ!... బాబు అడ్రెస్ గ‌ల్లంతు!
X
దేశంలోని 29 రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల సీఎంల ప‌నితీరు ఆధారంగా ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చిన ఓ స‌ర్వే ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ స‌ర్వేలో ప్ర‌జా కంట‌క పాల‌న సాగిస్తున్నారంటూ ఇత‌ర రాష్ట్రాల‌తో పాటు రాజ‌కీయ పార్టీల‌న్నీ దుమ్మెత్తిపోస్తున్న ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ టాప్ ప్లేస్‌ లో నిలిచారు. ఇక దేశంలోని రాజ‌కీయ నాయ‌కుల‌కంటే తానే సీనియ‌ర్ ను అని, 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన త‌న‌తో సాటి రాగల నేత ఎవ్వ‌రూ లేరంటూ బీరాలు ప‌లుకుతున్న టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు ఈ జాబితాలో అస‌లు చోటు ద‌క్క‌కపోవ‌డం గ‌మ‌నార్హమే. త‌న వ‌ద్ద రాజ‌కీయాల‌తో పాటు పాల‌నా అనుభ‌వం నేర్చుకున్నారంటూ చంద్ర‌బాబు నిత్యం చెప్పే టీఆర్ ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుకు ఈ జాబితాలో రెండో స్థానం ద‌క్కింది. ఈ జాబితాలో త‌ర్వాతి స్థానాల్లో ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ లు నిలిచారు.

అయినా బీజేపీకి చెందిన యోగి ఆదిత్య‌నాథ్ ప‌నితీరుపై ఆ పార్టీలోని కొన్ని వ‌ర్గాల‌తో పాటు దేశంలోని దాదాపుగా అన్ని రాజ‌కీయ పార్టీలు కూడా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇండియా టుడే, కార్వీ ఇన్ సైట్స్ సంస్థ‌లు *మూడ్ ఆఫ్ ది నేష‌న్* పేరిట నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో అంద‌రు సీఎంల‌ను వెన‌క్కు నెట్టేసిన యోగి... ఫ‌స్ట్ ప్లేస్‌ లో నిలిచారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ కు చెందిన 40 శాతం మంది ప్ర‌జ‌లు యోగి పాల‌న‌పై సంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతో పాటుగా ఇత‌ర రాష్ట్రాల సీఎంల కంటే త‌మ ముఖ్య‌మంత్రినే వారు అగ్ర‌భాగాన నిలిపారు. అంతేకాదండోయ్‌... యోగి పాల‌న‌కు ఆ రాష్ట్రంలో క్ర‌మ‌క్ర‌మంగా ఆద‌ర‌ణ పెరిగిపోతోంద‌ట‌. క‌మ్యూనిటీ పోలీసింగ్ ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా రెండేళ్ల క్రితమే సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన యోగిపై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలో ఓ ఏడాది క్రితం స‌ర్వే చేయ‌గా... యూపీలో కేవ‌లం 28 శాతం మంది ప్ర‌జ‌లు మాత్ర‌మే ఆయ‌న పాల‌న‌ను మెచ్చుకున్నారు. తాజాగా చేప‌ట్టిన ఈ స‌ర్వేలో ఆ 28 శాతం ఏకంగా 40 శాతానికి పెరిగిపోయింది. అంటే... యోగి పాల‌న‌పై సంతృప్తి వ్య‌క్తం చేస్తున్న ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల శాతం క్ర‌మంగా పెరుగుతోంద‌న్న మాట‌.

ఇక ఏపీ సీఎం చంద్ర‌బాబు విష‌యానికి వస్తే... రాష్ట్రంలో ప్ర‌జాక‌ర్ష‌క పాల‌న చేప‌డుతున్నాన‌ని చెబుతున్న చంద్ర‌బాబు... ఏపీలో కొన‌సాగుతున్న పాల‌న దేశంలోని మ‌రే ఇత‌ర రాష్ట్రంలోనూ లేద‌ని జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్నారు. అంతేకాకుండా దేశంలోనే అత్యుత్త‌మ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు... దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు ఏపీని ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతాన‌ని కూడా చెబుతున్నారు. అయితే మ‌రో మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వెలువ‌డిన ఈ స‌ర్వే చంద్ర‌బాబుకు షాకిచ్చింద‌నే చెప్పాలి. బెస్ట్ సీఎంల జాబితాలో క‌నీసం చోటు కూడా ద‌క్కించుకోలేక‌పోయిన చంద్ర‌బాబు... ఎన్నిక‌ల్లో మ‌రోమారు త‌న పార్టీని ఎలా విజ‌య ప‌థంలో న‌డుపుతారో చూడాలి.