Begin typing your search above and press return to search.

ఆ ముఖ్యమంత్రి ఆస్తుల లెక్క బయటకు వచ్చింది?

By:  Tupaki Desk   |   5 Feb 2022 4:12 AM GMT
ఆ ముఖ్యమంత్రి ఆస్తుల లెక్క బయటకు వచ్చింది?
X
ప్రస్తుతం దేశం మొత్తాన్ని ఆకర్షిస్తున్న యూపీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒక ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న యోగి ఆదిత్యనాథ్.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇప్పటివరకు వెలువడిన అంచనాల ప్రకారం చూస్తే.. బీజేపీ గెలుపు ఖాయమని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం.. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయాన్ని సొంతం చేసుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఇక.. ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. గోరఖ్ పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. తాజాగా తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాల్ని వెల్లడించారు. తనకు మొత్తం రూ.కోటిన్నర ఆస్తులు ఉన్నట్లుగా ప్రకటించారు. రెండు రైఫిల్స్.. ఒక సెల్ ఫోన్ ఉన్నట్లుగా ప్రకటించిన ఆయన.. ఎలాంటి వాహనం తన పేరు మీద లేదని వెల్లడించారు.

యోగి ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ లో ఆయన ప్రకటించిన వివరాల్ని చూస్తే.. తన మొత్తం ఆస్తుల విలువ రూ.1,54,94,054గా ప్రకటించారు. ఇందులో చేతిలో క్యాష్.. ఆరు బ్యాంకుఖాతాల బ్యాలెన్సుతో పాటు.. సేవింగ్స్ ఉన్నాయి. అంతేకాదు.. రూ.లక్ష విలువ చేసే రివాల్వర్.. రూ.80వేలు విలువ చేసే రైఫిల్ ఉన్నట్లు తెలిపారు. తన పేరు మీద ఎలాంటి వ్యవసాయ.. వ్యవసాయేతర భూములు లేవన్నారు. ఇక.. చాలామంది రాజకీయ నేతల మాదిరే ఆయన పేరు మీద సొంత వాహనం లేదు. ఇక.. ఆయన తన ఆస్తుల్లో భాగంగా రూ.12వేలు విలువ చేసే సామ్ సంగ్ సెల్ ఫోన్ ఉన్నట్లు వెల్లడించారు.

యోగికి రూ.49వేలు విలువ చేసే 20 గ్రాముల బంగారు చెవి రింగు.. రూ.20వేలు విలువ చేసే 10 గ్రాముల బంగారు గొలుసు.. రుద్రాక్ష హారం ఉన్నాయి. అయితే.. ఇప్పుడున్న ధరల ప్రకారం చూస్తే.. బంగారం ధర 10 గ్రాములు రూ.49వేల వరకు ఉంది కదా? అన్న సందేహం కలుగక మానదు. కాకుంటే.. ఆయన సదరు బంగారు ఆభరణాల్ని కొనుగోలు చేసిన సమయంలో ఉన్న ధరల్ని వెల్లడించారని చెప్పాలి.

ఆదాయం విషయానికి వస్తే.. మిగిలిన ముఖ్యమంత్రుల మాదిరి కాకుండా ఏడాదికేడాదికి ఆయన ఆస్తులు పెరగటం కన్నా తగ్గటం గమనార్హం. 2018-19లో ఆయన ఆదాయంతో పోలిస్తే.. ఆ తర్వాతి రెండు సంవత్సరాల్లో ఆయన ఆదాయం అంతకంతకూ తగ్గటం విశేషంగా చెప్పాలి. ఇక.. తన ఆస్తుల వివరాల్ని వెల్లడించిన ఆయన.. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పేర్కొన్నారు.
అంతకంతకూ పెరుగుతున్న వైనం కనిపిస్తుంది.

ఏడాది ఆదాయం
2017-18 ఆర్థిక సంవత్సరం రూ. 14,38,670
2018-19 ఆర్థిక సంవత్సరం రూ. 18,27,639
2019-20 ఆర్థిక సంవత్సరం రూ.15,68,799
2020-21 ఆర్థిక సంవత్సరం రూ. 13,20,653