Begin typing your search above and press return to search.

అఖిలేశ్ చేత బూట్లు విప్పించార‌ని యోగి చెప్ప‌ట‌మా?

By:  Tupaki Desk   |   4 May 2019 5:22 AM GMT
అఖిలేశ్ చేత బూట్లు విప్పించార‌ని యోగి చెప్ప‌ట‌మా?
X
ఏది ఉత్త‌నే జ‌ర‌గ‌దు. అందునా రాజ‌కీయాల్లో మ‌రీనూ. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థికి జ‌రిగిన అవ‌మానం గురించి ఒక రాజ‌కీయ ప్ర‌ముఖుడు.. అందునా ముఖ్య‌మంత్రి స్థానంలో కూర్చున్న వారి నోటి నుంచి రావ‌టం సాధ్య‌మేనా? అందులోకి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి లాంటి వారు ప్ర‌స్తావించ‌టం అంటే మామూలు విష‌యం కాదు. దాని వెనుక మ‌రేదో విష‌యం ఉండ‌టం ఖాయం. ఎస్పీ-బీఎస్పీ-ఆరెల్డీ కూట‌మి దెబ్బ‌కు యూపీలో బీజేపీకి చుక్క‌లు క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ భారీగా సీట్లు రావ‌టం వెనుక ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో బీజేపీకివ‌చ్చిన సీట్లే కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు. 80 ఎంపీ స్థానాలున్న యూపీలో 2014 ఎన్నిక‌ల్లో బీజేపీకి 71 సీట్లు సొంతం చేసుకోవ‌టంతో.. లోక్ స‌భ‌లో బీజేపీ బ‌లం భారీగా క‌నిపించిన ప‌రిస్థితి. ఈసారి అందుకు భిన్నంగా.. ఎస్పీ.. బీఎస్పీ.. ఆరెల్డీలు క‌లిసి కూట‌మిగా ఏర్ప‌డి పోటీ చేస్తుండ‌టంతో బీజేపీకి ఈసారి షాక్ త‌ప్ప‌ద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఈ నేప‌థ్యంలో కూట‌మి విచ్ఛిన్నానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే స‌మ‌యంలో.. యూపీ ముఖ్య‌మంత్రి యోగి నోటి నుంచి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు రావ‌టం గ‌మ‌నార్హం. కూట‌మి మొత్తం మాయ‌వ‌తే చ‌క్రం తిప్పుతున్నార‌ని.. వేదిక మీద క‌లిసి కూర్చునే స‌మ‌యంలో మాయ‌వ‌తికి పెద్ద కుర్చీ వేస్తున్నార‌ని.. అఖిలేశ్ ను చిన్న కుర్చీలో కూర్చోబెడుతున్నారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

అంతేనా.. మాయావ‌తిని క‌లిసేందుకు వెళుతున్న అఖిలేశ్ చేత‌.. బూట్లు విప్పించి మ‌రీ లోప‌ల‌కు పంపుతున్నార‌ని చెబుతున్నారు. కూట‌మిలో అఖిలేశ్ పొజిష‌న్ ఇదంటూ.. జాలి ప్ర‌ద‌ర్శిస్తున్న యోగి తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు.. త‌న కొడుక్కి మాయావ‌తి స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌ట్లేద‌ని ములాయం మండిప‌డుతున్న‌ట్లు యోగి చెబుతున్నారు. అయినా.. త‌మ పార్టీ గురించి మాట్లాడాల్సిన యోగి.. త‌న ప్ర‌త్య‌ర్థి పార్టీల ముచ్చ‌ట్లు.. అందులో ఎవ‌రు ఎవ‌రిని అవ‌మానిస్తున్నార‌న్న విష‌యాన్ని ఇంత డిటైల్డ్ గా ఎందుకు మాట్లాడుతున్న‌ట్లు? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

కూట‌మి మ‌ధ్య చిచ్చు రేప‌టంతో పాటు.. రేపొద్దున లెక్క తేడా వ‌స్తే.. అఖిలేశ్ ను త‌మ‌వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా యోగి ప్లాన్ స్టార్ట్ చేశారా? అన్న సందేహం రాక మాన‌దు. ఏమైనా.. కూట‌మిలో కొత్త అనుమానాలు పుట్టుకొచ్చేలా..యోగి వ్యాఖ్య‌లు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. మ‌రి.. యోగి మాష్టారి మాట‌ల‌కు అఖిలేశ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.