Begin typing your search above and press return to search.

ఆయ‌న్ను శాంపిల్ సీఎం అనుకుంటున్నార‌ట‌

By:  Tupaki Desk   |   2 May 2017 9:53 AM GMT
ఆయ‌న్ను శాంపిల్ సీఎం అనుకుంటున్నార‌ట‌
X
విల‌క్ష‌నంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌. ఆయ‌నెంపికే ఒక సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. క‌రుడుగ‌ట్టిన హిందుత్వ‌వాదిగా సుప‌రిచిత‌మైన యోగిని.. దేశంలోనే అత్యంత పెద్ద‌దైన ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లాంటి రాష్ట్రానికి సీఎంగా ఎంపిక చేయ‌టం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది. మోడీ నిర్ణ‌యం ఆత్మ‌హ‌త్యాసాదృశ్య‌క‌మైన‌దిగా కొంద‌రు అభివ‌ర్ణించినా.. అదేమాత్రం నిజం కాద‌న్న విష‌యాన్ని చాలా త్వ‌ర‌గానే తేల్చేశారు యోగి.

మిగిలిన వారి వాద‌న‌ల‌కు భిన్నంగా సింప్లిసిటీకి ప్రాధాన్య‌త ఇవ్వ‌టం.. ముక్కుసూటి నిర్ణ‌యాల‌తోపాటు.. పాల‌నా ప‌రంగా ఎలాంటి మార్పులు కోరుకుంటారో.. అలాంటి నిర్ణ‌యాల్ని తీసుకోవ‌టం.. నిర్ల‌క్ష్యంపై ఆయ‌న ఝుళిపిస్తున్న కొర‌డా ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌న యూపీ రాష్ట్ర రాజ‌ధాని ల‌క్నోలో జ‌రిగిన పార్టీ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత తొలిసారి పార్టీ స‌మావేశాన్ని నిర్వ‌హించిన ఆయ‌న‌.. నేత‌ల‌కు ప‌లు స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఇచ్చారు.

ఇదే స‌మ‌యంలో విప‌క్షాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను ఎదుర్కొవ‌టానికి విప‌క్షాల‌న్నీ ఏకం కావాల‌ని భావిస్తున్నాయ‌ని.. త‌న‌నో శాంపిల్ పీస్‌ను సీఎంగా ఎలా ఎంపిక చేశార‌ని చ‌ర్చించుకుంటున్న‌ట్లుగా చెప్పారు. రాష్ట్రంలో త‌మ పార్టీ ప‌వ‌ర్‌లోకి వ‌చ్చిన త‌ర్వాత నుంచి సీఎం కార్యాల‌యం ఎప్పుడూ సంద‌డిగా ఉండేద‌న్న ఆయ‌న‌.. గ‌తంలో అందుకు భిన్నంగా ఉండేద‌ని అఖిలేశ్ స‌ర్కారుపై చుర‌క‌లు వేశారు.

గ‌తంలో ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన అఖిలేశ్ హ‌యాంలో సీఎం కార్యాల‌యం లంచ్ త‌ర్వాత ఖాళీ అయ్యేద‌ని.. ఇప్పుడు అలా లేద‌న్నారు. అంతేకాదు.. జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంద‌ర్భంగా మంత్రులు పూల‌దండ‌లు.. బోకేల‌తో స్వాగ‌తం ప‌లికే విధానానికి స్వ‌స్తి ప‌ల‌కాల‌ని.. అందుకు బ‌దులుగా అంద‌రూ స్వ‌చ్ఛ భార‌త్ చేయాల‌ని కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/