Begin typing your search above and press return to search.

యోగిజీ ఆర్డ‌ర్ అధికారుల‌ను ఇబ్బందిపెట్టేదేన‌ట‌

By:  Tupaki Desk   |   21 Oct 2017 7:51 AM GMT
యోగిజీ ఆర్డ‌ర్ అధికారుల‌ను ఇబ్బందిపెట్టేదేన‌ట‌
X
ప్ర‌జాసంక్షేమం కోణంలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటార‌నే పేరున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌న‌మైన‌దే అయిన‌ప్ప‌టికీ అది ప్ర‌జ‌ల కోణంలో లేదంటున్నారు. వీఐపీ సంస్కృతికి చెక్‌ పెడుతూ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ 36 ఏళ్ల‌ కిందటి ప్రొటోకాల్‌ ను రద్దు చేసింది.. కానీ దానికి పూర్తి భిన్నంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్యేలు - ఎంపీలు.. ప్రభుత్వ కార్యాలయాల సందర్శనకు వచ్చినప్పుడు అధికారులు లేచి నిలబడి, గౌరవ పూర్వకంగా స్వాగతం పలకాలని యోగి ఆదిత్యనాధ్‌ సర్కారు వెల్లడించింది. అంతేకాదు తేడా వ‌స్తే చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది.

ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు తమకు గౌరవం ఇవ్వట్లేదని ఇటీవల కొందరు ఎంపీలు - ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కు ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు చేస్తే ఘాజీపూర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ.. రాష్ట్ర క్యాబినెట్‌ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌ భర్‌.. కొద్ది నెలల క్రితం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బైటాయించారు. అంతేకాదు తన పదవికి రాజీనామా చేస్తానని కూడా బెదిరించారు. తాజాగా వీటిన్నింటినీ పరిశీలించిన ప్రధాన కార్యదర్శి అధికారులను హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎంపీలు - ఎమ్మెల్యేలు తమను కలవడానికి వచ్చినప్పుడు అధికారులు తప్పనిసరిగా లేచి నిలబడి వారిని స్వాగతించాలని.. అలాగే వెళ్లేప్పుడు కూడా నిలబడి వారిని పంపించాలని సూచించారు. ఈ ప్రొటోకాల్‌ ను పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

రైల్వే బోర్డు చైర్మెన్‌ - సభ్యులు.. జోన్ల పర్యటనకు వెళ్లినప్పుడు జనరల్‌ మేనేజర్లు బొకేలతో స్వాగతం చెప్పకూడదని, బహుమతులు ఇవ్వరాదని ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాక.. బోర్డు సభ్యు ల వెంట మేనేజర్లు - ఇతర అధికారులు ఉండాల్సిన పని లేదని కూడా తేల్చి చెప్పింది.