Begin typing your search above and press return to search.

ఆ సీఎం ఇంటి ముందు సెల్ఫీ దిగితే కేసే!

By:  Tupaki Desk   |   21 Dec 2017 2:31 PM GMT
ఆ సీఎం ఇంటి ముందు సెల్ఫీ దిగితే కేసే!
X
ఇమేజ్ ను కాపాడుకోవ‌టం.. అంత‌కంత‌కూ పెంచుకోవ‌టం అంత తేలికైన విష‌యం కాదు. దానికి చాలానే స‌మ‌స్య‌లు ఉంటాయి. ఓర్పుగా.. నేర్పుగా వ్య‌వ‌హ‌రించ‌టంతో పాటు వ్యూహాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌టం చాలా అవ‌స‌రం. ఈ విష‌యంలో యూపీ ముఖ్య‌మంత్రి త‌ప్పులో కాలేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

అనూహ్యంగా యూపీ ముఖ్య‌మంత్రి కుర్చీలో కూర్చునే అవ‌కాశం వ‌చ్చిన యోగి ఆదిత్య‌నాథ్ త‌న తీరుతో స‌రికొత్త ఇమేజ్‌ను సొంతం చేసుకోవ‌టంతో పాటు.. జాతీయ స్థాయిలో ఆయ‌న‌కువ‌చ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. దీంతో.. ఒక‌ప్పుడు యోగిని త‌ప్పు ప‌ట్టే వారు సైతం ఆయ‌న్ను అభిమానించే ప‌రిస్థితి.

నిజాయితీగా ఉంటున్నార‌ని.. ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న పేరు ప్ర‌ఖ్యాతుల్ని సొంత చేసుకున్న ఆయ‌న‌.. ఇటీవ‌ల కాలంలో ప‌లు విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అక్కడి అధికారులు తీసుకుంటున్న నిర్ణ‌యంపై తీవ్ర‌స్థాయిలో మండిపాటు వ్య‌క్త‌మ‌వుతోంది. ప్లేస్ ఏదైనా స‌రే.. దాన్ని క‌వ‌ర్ చేసేలా పెల్ఫీలు తీసుకోవ‌టం ఇప్పుడో అల‌వాటుగా మారింది.

ఇందులో భాగంగా క్రేజీ సీఎంగా పేరున్న యోగి నివాసం ఎదుట సెల్ఫీలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని.. సీఎం ఆదిత్య‌నాథ్ ఇంటి ముందు సెల్ఫీలు తీసుకున్నా.. వీడియోలు తీసిన వారిని జైలుకు పంపిస్తామ‌ని అధికారులు చెబుతున్నారు.మాట‌లే కాదు.. చేత‌ల్లోనూ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న‌ట్లుగా సీఎం నివాస‌మైన కాళిదాస్ మార్గ్ ద‌గ్గ‌ర ఫోటోలు తీసే వారిపై తీసుకునే చ‌ర్య‌ల బోర్డుల్ని ఏర్పాటు చేశారు.

ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ఉండ‌టం కోసం.. భ‌ద్ర‌త‌లో భాగంగానే తామీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధికారులు చెబుతున్నా.. సీఎం నివాసం ముందు సెల్ఫీ దిగ‌టం కూడా చ‌ట్ట‌వ్య‌తిరేక‌మా? అని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. ఈ నిర్ణ‌యంపై ప‌లు రాజ‌కీయ ప‌క్షాలు మండిప‌డుతూ.. సీఎం కొత్త సంవ‌త్స‌రం కానుక‌ను యూపీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చారంటూ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేశ్ యాద‌వ్ ట్వీట్ చేశారు. గ‌తంలో మాయావ‌తి సీఎంగా ఉన్న‌ప్పుడు ఈ త‌ర‌హాలోనే ఆంక్ష‌లు విధించ‌గా.. త‌ర్వాత ప‌వ‌ర్లోకి వ‌చ్చిన అఖిలేశ్ వాటిని ఎత్తేశారు. తాజాగా యోగి కూడా మాయావ‌తి బాట‌లో న‌డ‌వ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.