Begin typing your search above and press return to search.

ఇపుడు సీఎం యోగి... ఇంత‌కుముందు??

By:  Tupaki Desk   |   19 March 2017 7:46 AM GMT
ఇపుడు సీఎం యోగి... ఇంత‌కుముందు??
X
యూపీ సీఎంగా కరడుగట్టిన హిందూత్వ వాది యోగి ఆదిత్యనాథ్ ను నియమించిన సంగతి తెలిసిందే. దూకుడు గల నేతగా పేరున్న ఆయన కారణంగా వివాదాలు తలెత్తుతాయన్న అనుమానం చాలామందిలో ఉంది. ఆయనకు ఎక్కడికక్కడ చెక్ పెట్టుకుంటూ వెళ్లకపోతే ఇబ్బందులు తప్పవన్న భావనా ఉంది. అయితే... ఈ సంగతులేవీ ప్రధాని మోడీకి కానీ - బీజేపీలోని ఇతర పెద్దలకు కానీ.. ఆరెస్సెస్ సిద్ధాంత కర్తలకు కానీ తెలియందేమీ కాదు. అన్నీ తెలిసే ఆయనకు సీఎం పీఠం అప్పగించారు. అంతేకాదు.. కొన్నాళ్లపాటు ఆయనకు ఫుల్ ఫ్రీడం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యోగికి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల కలిగే రచ్చ కంటే చెక్ పెట్టడం వల్ల కలిగే రచ్చే ఎక్కువన్న సంగతి కూడా మోడీ మొదలుకుని బీజేపీ పెద్దలందరికీ తెలిసిన విషయమే.

ఎందుకంటే... యోగికి యూపీలో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. మరీ ముఖ్యంగా యూత్ లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. తూర్పు - ఈశాన్య యూపీతో పాటు పొరుగు రాష్ర్టాలైన బిహార్ - జార్ఖండ్ - మధ్యప్రదేశ్ లోనూ ఆయన ప్రభావం ఉంది. పైగా ఆయన ఏ విషయంలోనూ వెనక్కు తగ్గే నేత కాదు. మొన్నటి ఎన్నికల్లోనే 100 సీట్లు తన వాళ్లకు అడిగారంటే ఆయన రేంజి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మోడీ పట్టిందల్లా బంగారం అవుతున్న సమయంలో కూడా నిన్న యూపీ సీఎం అభ్యర్థి ఎంపిక సమయంలో యోగి అనుచరులు నిర్భయంగా అక్కడ తమ గొంతు వినిపించి యోగిని సీఎం చేయాలంటూ నినాదాలు చేశారు.

అంతేకాదు... పార్టీకి తన అవసరం ఉందన్న విషయం యోగికి చాలా స్పష్టంగా తెలుసు. ఆరెస్సెస్, బీజేపీ నేపథ్యం లేకుండా యూపీలో హిందూత్వానికి ఇప్పుడు అతి పెద్ద ఐకాన్ గా నిలిచిన ఆయన దూకుడును చూసి భయపడే వారూ ఉన్నారు, ముచ్చటపడేవారూ ఉన్నారు. ముఖ్యంగా యోగి స్థాపించిన హిందూ యువ వాహిని సంస్థ దేశంలో హిందూత్వవాదులకు అతిపెద్ద వేదికగా నిలుస్తుందని.. మరో ఆరెస్సెస్ అవుతుందని నమ్ముతున్నవారు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే యోగి ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంటారు.

2019 ఎన్నికల వరకు యోగి ఆదిత్యనాథ్ యూపీలో హిందూత్వ విషయంలో ఎంత దూకుడు ప్రదర్శించినా అడ్డు చెప్పకుండా చూడాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోందట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిన హిందూ ఏకీకరణ ప్రభావం 2019 వరకు కొనసాగించాలన్న ప్లానులో భాగంగానే ఆయనకు స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. 2019 తరువాత మాత్రం మళ్లీ యూపీ ఎన్నికల లక్ష్యంగా అభివృద్ధి విధానాలతో.. అందరినీ దరి చేర్చుకునే విధానాలతో సాగాలన్నది ఆ పార్టీ యూపీ పంచవర్ష ప్రణాళికగా తెలుస్తోంది.

కాగా ఫైర్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ కలిగిన ఆదిత్యనాధ్‌ నేపథ్యం చాలా ఆసక్తికరం. రాజపుత్రుల కుటుంబానికి చెందిన ఆయన ఈశాన్య ఉత్తరప్రదేశ్‌ తో పాటు నేపాల్‌ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు కలిగిన గోరఖ్‌ నాధ్‌ మఠానికి అధ్యక్షుడు. కేవలం 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికయ్యారు. తొలిసారి గోరఖ్‌ పూర్‌ నుంచి 1998లో నుంచి ఎంపీగా గెలుపొందారు. అప్పటి నుంచి ఓటమన్నది ఎరుగకుండా అదే నియోజకవర్గం నుంచి లోక్‌ సభకు ఎన్నికవుతున్నారు. యోగికి ముందు ఈ నియోజకవర్గం నుంచి ఆయన ఆధ్యాత్మిక గురువు మహంత్‌ అవైద్యనాధ్‌ 1989 నుంచి 1998 వరకు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ మత గురువుగా,హిందుత్వవాదిగా పేరొందిన యోగి దేశప్రజలకు సుపరిచితుడు.

అసలు పేరు – అజయ్‌ మోహన్ నేగి

పుట్టిన తేదీ – జూన్‌ 5, 1972, ఉత్తరప్రదేశ్‌

కుటుంబ నేపథ్యం – గర్హ్‌వాలీ రాజపుత్రుల కుటుంబం

విద్యార్హతలు – మ్యాథమెటిక్స్‌ లో డిగ్రీ

యూనివర్శిటీ – హచ్‌ ఎన్‌ బి గర్హ్‌ వాల్‌ యూనివర్శిటీ,శ్రీనగర్‌, ఉత్తరాఖండ్‌.

రాజకీయ జీవితం ప్రారంభం – 12వ లోక్‌సభ కు తొలిసారి గోరఖ్‌ పూర్‌ ఎంపీగా ఎన్నిక

మత గురువు – 2014 నుంచి గోరఖ్‌ నాధ్‌ మఠానికి అధ్యక్షుడు