Begin typing your search above and press return to search.

ఇదీ యోగీ మార్కు ఆతిథ్యం!

By:  Tupaki Desk   |   30 March 2017 8:04 AM GMT
ఇదీ యోగీ మార్కు ఆతిథ్యం!
X
బీజేపీ త‌ర‌ఫున ఐదు సార్లు పార్ల‌మెంటుకు ఎన్నిక‌వ‌డ‌మే కాకుండా... ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఉంటూనే హిందూత్వ వాద‌మంటే ఇదేన‌నేలా వ్య‌వ‌హ‌రించి విమ‌ర్శ‌ల జ‌డివాన‌కు ఏమాత్రం జ‌డ‌వ‌కుండా ముందుకు సాగిన ఆదిత్య నాథ్ యోగీ... ఏం చేసినా ప్ర‌త్యేక‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే... పార్టీకి అధికారం ద‌క్క‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌స్తుత బీజేపీ నేత‌ల‌కు ఏమాత్రం పొంత‌నా, పోలికే లేకుండా త‌న‌దైన హిందూత్వ వాద‌న‌ను భుజానికెత్తుకుని ముందుకు సాగుతున్న యోగీ... అక‌స్మాత్తుగా సీఎం పీఠం ద‌క్కిపోయింది. అది కూడా దేశ రాజ‌కీయాల‌నే మ‌లుపు తిప్ప‌గ‌లిగిన స‌త్తా ఉన్న కీల‌క రాష్ట్రం ఉత్త‌ర ప్ర‌దేశ్‌ కు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి పీఠమంటే... భావి ప్ర‌ధానిగా మీడియా ప్ర‌చారం స‌ర్వ‌సాధార‌ణంగా మారిన ప్ర‌స్తుత త‌రుణంలో పార్టీలోని కీల‌క నేత‌ల‌ను కాద‌ని అతివాదిగా ముద్ర‌ప‌డిన యోగీని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ యూపీ సీఎంగా ఎంపిక చేశారు.

అస‌లు మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో యోగీ పోటీనే చేయ‌లేదు. అంటే... ప్ర‌స్తుతం కొత్త‌గా కొలువుదీరిన యూపీ అసెంబ్లీలో గానీ, ఆ రాష్ట్ర శాస‌న మండ‌లిలో గాని యోగీ స‌భ్యుడే కాదు. అయినా కూడా... గోర‌ఖ్‌ పూర్ ఎంపీగా ఉన్న యోగీనే యూపీ సీఎం పీఠం వ‌రించింది. సీఎం పీఠం కోసం చాలా మంది బీజేపీ నేత‌లు చేయ‌ని య‌త్న‌మంటూ లేదు. అయితే ఏ చిన్న ప్ర‌య‌త్నం కూడా చేయ‌కుండానే యోగీ ఆ పీఠాన్ని చేజిక్కించుకున్నారు. బీజేపీ అధిష్ఠానం పెద్ద‌ల‌కు యోగీలో ఏం క‌నిపించిందో తెలియ‌దు గానీ... త‌మ‌ను ఎంపిక చేయ‌మ‌ని చాలా మంది వెంట‌బ‌డ్డా.. కూడా వారందరినీ కాద‌ని యోగీని ఎంపిక చేసిన వైనం నిజంగా ఆశ్చ‌ర్య‌మే. బీజేపీ అధిష్ఠానం మ‌న‌సు యోగీకి బాగానే తెలిసిన‌ట్టుంది. అందుకే కాబోలు... యూపీ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌గానే... హిందూత్వ వాద‌న‌కు త‌గ్గ‌ట్టుగా ప‌క్కా ప్ర‌ణాళిక‌ను ర‌చించుకున్న ఆయ‌న ప్ర‌భుత్వ ప‌రంగా ఎలాంటి నిర్దిష్ట ఆదేశాలు లేకుండానే త‌న‌దైన పాల‌న‌ను ప‌ట్టాలెక్కించేశారు.

ఇదంతా ఒక ఎత్తైతే... సీఎంగా ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టాక యోగీ కొత్త‌గా సీఎంకు ప్ర‌భుత్వం కేటాయించిన అధికారిక నివాసంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అవ‌లంబించిన వ్యూహం చూస్తే... కాక‌లు తీరిన రాజ‌కీయ‌నేత‌లు కూడా ముక్కున వేలేసుకునే ప‌రిస్థితి. సీఎం అధికారిన గృహ ప్ర‌వేశ కార్య‌క్ర‌మానికి యోగీ ఆహ్వానితుల లిస్టు చాంతాడంత ఉంది. ఆ పేర్లు ఇక్క‌డ రాసుకోవ‌డం దుస్సాధ్య‌మే. ఎందుకంటే... ఏ ప‌ది మందో, ఇర‌వై మందో ప్ర‌త్యేక ఆహ్వానితులు ఉంటే... వారి పేర్ల‌ను వ‌రుస పెట్టి రాసుకోవ‌చ్చు. కానీ యోగీ పిలిచిన ప్ర‌త్యేక‌ ఆహ్వానితుల లిస్టు వంద‌కు పైగా ఉంద‌ట‌. ఇక ఆయ‌న నుంచి ఇన్విటేష‌న్ అందుకున్న సాధార‌ణ గెస్టుల లిస్టు సంఖ్య చెప్ప‌డం మాత్రం చాలా క‌ష్టం. ఎందుకంటే ఆ లిస్టులో ఎంత‌మంది ఉన్నారో... సాక్షాత్తు యోగీకి కూడా తెలిసి ఉండ‌దేమో. వారంతా ఎవ‌ర‌నుకుంటున్నారు?.... మొన్న‌టి ఎన్నిక‌ల్లో యూపీలో బీజేపీకి అధికార పీఠం ద‌క్కేందుకు అహోరాత్రులు శ్ర‌మించిన బీజేపీ నేత‌లు, క‌ర సేవ‌కులు, హిందూత్వ వాదులు. వీహెచ్‌ పీ కార్య‌క‌ర్త‌లు కూడా ఆ లిస్టులో ఉన్నారు మ‌రి.

త‌న ఆహ్వానాన్ని మ‌న్నించి త‌న గృహ‌ప్ర‌వేశానికి వ‌చ్చిన వారిని ఉద్దేశించిన యోగీ చేసిన ప్ర‌సంగం కూడా ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాలి. తెర ముందు ఎన్నిక‌ల్లో పోటీ చేసిన వ్య‌క్తులు ఉంటే... తెర వెనుక రాత్రింబ‌వ‌ళ్లనే తేడా లేకుండా క‌ష్ట‌ప‌డిన వారు ఎంతో మంది ఉన్నారు. వారంతా ఈ కార్యక్ర‌మానికి హాజ‌ర‌య్యారు. వారిని చూసిన యోగీ... ఆవేశంగానే కాకుండా.. కాస్తంత ఉద్వేగ‌భ‌రితంగా ప్ర‌సంగించారు. ‘పార్టీ కోసం కఠోరంగా పనిచేసి భారీ విజయాన్ని కట్టబెట్టిన ప్రతి ఒక్కరినీ నేను చూడాలని అనుకున్నాను. అందుకే ఈ ఆతిథ్యం’ అని యోగీ పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/