Begin typing your search above and press return to search.

న్యాయం అడిగితే యోగి ఇంత‌లా తొక్కేస్తారా?

By:  Tupaki Desk   |   26 Sep 2017 4:40 AM GMT
న్యాయం అడిగితే యోగి ఇంత‌లా తొక్కేస్తారా?
X
మొద‌ట్లో మోడీని ప‌ల్లెత్తు మాట అన‌ని వారు సైతం గ‌డిచిన కొద్దిరోజులుగా అదే ప‌నిగా విమ‌ర్శించ‌టం క‌నిపిస్తుంది. ఆర్నెల్లు కింద‌ట వ‌ర‌కూ ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన వారు.. ఆయ‌న త‌ర‌ఫున వ‌క‌ల్తా పుచ్చుకున్న‌ట్లుగా వాదించే వారు సైతం నెమ్మ‌ది నెమ్మ‌దిగా మోడీకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్ప‌టం షురూ చేశారు. తెలుగు ప్ర‌జ‌ల విష‌యానికే వ‌స్తే.. ఏపీకి ఇవ్వాల్సిన ప్ర‌త్యేక ప్యాకేజీ విష‌యంలో ఎంత‌లా హ్యాండ్ ఇచ్చారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

ఇది స‌రిపోన‌ట్లుగా ప‌లు రాష్ట్రాల విష‌యంలో మోడీ అండ్ కో అనుస‌రించిన వైనం.. బిహార్ లో లాలూకు ఝుల‌క్ ఇస్తూ.. నితీశ్‌ను త‌న‌తో క‌లుపుకోవ‌టంలో స‌క్సెస్ అయ్యారు. ఇది స‌రిపోన‌ట్లుగా గుజ‌రాత్ లో ఇటీవ‌ల జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్‌పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి రాజ‌కీయ స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన అహ్మ‌ద్ ప‌టేల్ ను ఎన్నిక కాకుండా ఉండేందుకు మోడీ బ్యాచ్ ఎంత తీవ్రంగా కృషి చేసిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఒక రాజ్య‌స‌భ ఎన్నిక కోసం మోడీ ప‌రివారం మ‌రీ ఇంత‌గా దిగ‌జారిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారా? అన్న సందేహం ప‌లువురిలో క‌లిగింది.

మోడీ అస‌లు రంగు తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ చాలామందికి సాయం చేసింద‌న్న విమ‌ర్శ కూడా ఉంది. ఇదిలా ఉంటే.. త‌న‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించే వారిని డీల్ చేసే విష‌యంలో న‌మో స్టైల్ వేరుగా ఉంటుంద‌ని చెబుతారు. ఈ వాద‌న‌కు త‌గ్గ‌ట్లే.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులంతా ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా సీబీఐ దాడులకో.. ఈడీ క‌బంధ హ‌స్తాల్లో చిక్కుకోవ‌టం క‌నిపిస్తుంది. రాజ‌కీయంగా త‌న‌కు ఎదురే లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా మోడీ గురించి విమ‌ర్శ‌లు చేయ‌టం క‌నిపిస్తుంది. ఇదిలా ఉంటే.. మోడీకి ప్రియాతి ప్రియ‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బ‌నార‌స్ వ‌ర్సిటీలో తమ హ‌క్కుల గురించి.. భ‌ద్ర‌త గురించి సందేహాలు వ్య‌క్తం చేస్తూ నిర‌స‌న గ‌ళం వినిపించిన విద్యార్థినుల విష‌యంలో పోలీసులు అనుస‌రించిన వైనం ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది.

వ‌ర్సిటీలో త‌మ‌పై లైంగిక వేధింపులు.. దాడులు పెరుగుతున్నాయ‌ని.. ఇందుకు బాధ్యులైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. లైంగిక దాడులకు నిర‌స‌న‌గా ఇప్ప‌టికిప్పుడు విద్యార్థినులు ఇంత ఆగ్ర‌హం ఎందుకు వ్య‌క్తం చేస్తున్నారంటే.. దానికి స‌రైన కార‌ణం లేక‌పోలేదు. ప్ర‌ధాని మోడీ ఈ రోజు (సోమ‌వారం) వార‌ణాసి ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో త‌మ స‌మ‌స్య‌ల్ని ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లేందుకు వారు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న షురూ చేశారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గానికి తొలిసారి వ‌చ్చిన నేప‌థ్యంలో త‌మ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధాని సానుకూలంగా స్పందిస్తార‌న్న ఆలోచ‌న‌తో విద్యార్థులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్లాన్ చేశారు.

విద్యార్థుల వ్యూహాన్ని గుర్తించిన పోలీసులు వారిని నిలువ‌రించేప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఊహించ‌ని రీతిలో కొంద‌రు పోలీసుల అత్యుత్సాహం విద్యార్థుల‌కు చేదు అనుభ‌వంగా మారింది. ఆందోళ‌న‌కారుల‌పై పోలీసుల దాష్టీకం విద్యార్థుల క‌డుపు మండేలా చేసింది.

దీంతో.. అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌శాంతంగా ఉన్న బెనార‌స్ వ‌ర్సిటీ ఒక్క‌సారిగా అద‌న‌పు భ‌ద్ర‌త‌ను పెట్టాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. విద్యార్థుల తీవ్ర ఆగ్ర‌హం నేప‌థ్యంలో వ‌ర్సిటీ ముందు నుంచి వెళ్లాల్సిన మోడీ సైతం త‌న రూట్‌ ను మార్చేసుకున్నారు. విద్యార్థుల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నేప‌థ్యంలో పోలీసులు లాఠీల‌కు పెద్ద ఎత్తున ప‌ని చెప్ప‌టం ఇప్పుడు అంద‌రి నోట పోలీసుల దుందుడుకుత‌నం.. దాష్టీకంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది.

ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ఊహించ‌ని రీతిలో వ్య‌వ‌హ‌రించారు. విద్యార్థుల‌పై రెచ్చిపోయిన‌ పోలీసులను ప‌ల్లెత్తు మాట అన‌ని యోగి.. లాఠీఛార్జ్ చూస్తున్న‌ప్పుడు వీడియోలు తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. యోగి నిర్ణ‌యంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

జాతీయ వ్య‌తిరేకులు.. మోడీ వ్య‌తిరేకులు అంతా క‌లిసి ఈ త‌ర‌హా కుట్ర ప‌న్ని ఇలాంటి వీడియోల‌ను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తున్న‌ట్లు విమ‌ర్శిస్తున్నారు. ఇక‌.. విద్యార్థుల వెర్ష‌న్ చూస్తే.. తాము నిర్వ‌హించిన ర్యాలీని ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చేప‌ట్ట‌టం ద్వారా ఆయ‌న దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లాల‌న్న‌ది విద్యార్థుల ప్ర‌య‌త్నం. అయితే.. పోలీసుల ఓవ‌రాక్ష‌న్‌.. దానికి మించి యోగి స‌ర్కారు అనుస‌రించిన తీరు ఇప్పుడీ అంశం జాతీయ స్థాయిలో వివాదంగా మారే అవ‌కాశం ఉంది.

త‌మ‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌పై విద్యార్థినులు గ‌ళం విప్ప‌ట‌మే త‌ప్ప‌న్న‌ట్లుగా యోగి స‌ర్కారు వ్య‌వ‌హ‌రించ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. పోలీసుల లాఠీచార్జ్ తో వ‌ర్సిటీ క్యాంప‌స్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వాస్త‌వానికి సెప్టెంబ‌రు 28 నుంచి ద‌స‌రా సెల‌వులు ఉండ‌గా.. మూడు రోజుల ముందే సెల‌వుల్ని ప్ర‌క‌టించారు. హాస్ట‌ల్స్‌ను వెంట‌నే ఖాళీ చేసి విద్యార్థినులు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించటం చూస్తుంటే.. విద్యార్థుల నిర‌స‌న‌కు చెక్ పెట్టేందుకే యోగి స‌ర్కారు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.

త‌మ విష‌యంలో ఇంత జ‌రుగుతున్నా ప్ర‌ధాని మోడీ స్పందించ‌క‌పోవ‌టంపై విద్యార్థినులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆవుల ఆరోగ్య ప‌రీక్ష‌ల‌ను ప‌ర్య‌వేక్షించిన ప్ర‌ధాని.. నోరు విప్పి త‌మ‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌పై మాట్లాడే వారి విష‌యాన్ని ఎందుకు పట్టించుకోరంటూ సూటిప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు. ఓటుహ‌క్కు లేని ఆవుల కంటే ఓటు హ‌క్కు.. రాజ్యాంగ హ‌క్కులున్న తాము త‌క్కువా? అంటూ వారు ప్ర‌శ్నిస్తున్నారు.

విద్యార్థినుల‌పై పోలీసులు జ‌రిపిన పాశ‌విక దాడి వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన రీతిలో యోగి స‌ర్కారు రియాక్ట్ కాలేదంటున్నారు. యోగికి పాల‌నా సంబంధ‌మైన అంశాల్లో ఆయ‌న‌కు పెద్ద‌గా ప‌రిణితి లేక‌పోవ‌టం తాజా ఇష్యూ ఇంత పెద్ద‌ది కావ‌టానికి కార‌ణ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.ఇలాంటి త‌ప్పులకు రాజ‌కీయంగా భారీ మూల్యం చెల్లించాల‌న్న విషయం యోగి స‌ర్కారుకు ఎప్పుడు అర్థ‌మ‌వుతుందో?