Begin typing your search above and press return to search.
యోగి సత్తాకు ఈ ఎన్నికలే నిదర్శనమట
By: Tupaki Desk | 10 Sep 2017 11:03 AM GMTఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించింది దేశం చూపును తనవైపు తిప్పుకొంటున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అసలు పరీక్ష ముందు ఉందని అంటున్నారు. ఇన్నాళ్లు సంచలన నిర్ణయాలతో ముందుకు సాగిన యోగి ఇప్పుడు తన కారణంగానే వస్తున్న ఉప ఎన్నికను ఎదుర్కోవడం ఆయన సత్తాకు నిదర్శనమని అంటున్నారు. గోరఖ్‌పూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తుంటే ఫూల్ పూర్ స్థానానికి ఉప ముఖ్యమంత్రి కేశవప్రసాద్ ప్రాతినిధ్యం వహించారు. అయితే వీరిద్దరూ రాష్ట్ర శాసన పరిషత్‌కు ఎన్నిక కావడంతో రెండు లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాల్సి వస్తోంది. దీంతో ఈ రెండు స్థానాలకుజరగనున్న ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాబల్యానికి, అధికార బిజెపికి పట్టుకు నిదర్శనంగా నిలుస్తాయని అంటున్నారు.
గోరఖ్ పూర్ - ఫూల్ పూర్ లోక్ సభ స్థానాలు రెండూ తూర్పు యూపీ పరిధిలోని స్థానాలు కాబట్టి వీటి ఫలితాలు అధికార - విపక్షాలకు భవిష్యత్ సంకేతాలే అవుతాయి. అందుకే వీటిలో విజయానికి పోటాపోటీగా ప్రయత్నాలు మొదలెట్టాయి. ముఖ్యంగా గోరఖ్ పూర్ స్థానంలో బీజేపీ విజయం అన్నది ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కు అత్యంత ప్రతిష్టాత్మక అంశం. 1998 నుంచి కూడా ఇదే స్థానానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. పైగా గోరఖ్‌పూర్ పీఠంతో సంబంధంలేని వ్యక్తిని బీజేపీ బరిలోకి దించాల్సి వస్తుంది కాబట్టి అలాంటి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఓటర్లు ఎంతమేరకు మొగ్గుచూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 3లక్షల పైచిలుకు మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి ఆదిత్యనాథ్ గెలుపొందారు. కులపరమైన లెక్కలను పరిగణలోకి తీసుకుని శివప్రసాద్ శుక్లాకు ఇటీవల కేంద్ర మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించినట్టు చెబుతున్నారు. 2014లో ఫూల్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి కేశవ ప్రసాద్ వౌర్య గెలుపొందినందున ఆయన స్థానే ప్రభావశీలగల వ్యక్తినే ఈ ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టాల్సి వస్తుంది.
మరోవైపు ఈ రెండు చోట్లా సమాజ్ వాదీ పార్టీ 3 లక్షలకు పైగా ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి కాబట్టి ఈ స్థానంలో మళ్లీ గెలవడం అన్నది బీజేపీకి పెద్ద సవాలే. బీఎస్పీ అధినేత్రి మాయావతి వేయబోయే అడుగు ఎలా ఉంటుందన్నదానిపైనా ప్రతిపక్షాల ఐక్యత ఆధారపడి ఉంటుందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే సెమీఫైనల్ అని పలువురు విశ్లేషిస్తున్నారు.