Begin typing your search above and press return to search.

యోగి స‌ర్కారుకు 'రేప్' మ‌ర‌క‌!

By:  Tupaki Desk   |   10 April 2018 4:55 AM GMT
యోగి స‌ర్కారుకు రేప్ మ‌ర‌క‌!
X
అన్ని రోజులూ ఒకేలా ఉండ‌వు. సాఫీగా సాగిపోయే బండిని ఒడిదుడుకుల‌కు గురి కాకుండా చూసుకోవ‌టం కూడా స‌మ‌ర్థ‌తే. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తుంటే.. యూపీ ముఖ్య‌మంత్రి యోగికి ఆ త‌ర‌హా స‌మ‌ర్థ‌త పెద్ద‌గా లేదా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యే ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా తెర‌పైకి వ‌చ్చిన రేప్ ఉదంతం యోగి స‌ర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. అత‌డి సోద‌రులు త‌న‌ను రేప్ చేశారంటూ ఒక మ‌హిళ చేస్తున్న ఆరోప‌ణలు ఇప్పుడు యోగికి త‌ల‌నొప్పిగా మారాయి. ఏడాదిగా ఆమె చేస్తున్న పోరాటం తాజాగా ఊహించ‌ని మ‌లుపు తీసుకుంది. త‌నకు జ‌రిగిన అన్యాయంపై స్పందించ‌ని యోగి స‌ర్కారు తీరును నిర‌సిస్తూ.. సీఎం నివాసం ఎదుట ఆమె ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసుకోవ‌టం సంచ‌ల‌నంగా మారింది. దీనికి ప్ర‌తిగా పోలీసులు ఆమె తండ్రిపైన త‌ప్పుడు కేసు బ‌నాయించి అరెస్ట్ చేయ‌టం.. పోలీసుల క‌స్ట‌డీలో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌టం.. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించ‌టంతో ఈ వ్య‌వ‌హారం సీరియ‌స్ అంశంగా మారింది.

అధికార‌పార్టీ ఎమ్మెల్యే పైనా.. ఆయ‌న సోద‌రుల‌పైనా రేప్ ఆరోప‌ణ‌లు వ‌స్తే.. వాటిపై ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌టంలో నిర్ల‌క్ష్యం చేస్తుందంటూ విప‌క్షాలు విరుచుకుప‌డ‌టంతో సీఎం యోగి అలెర్ట్ అయ్యారు. ఇక‌.. సోష‌ల్ మీడియాలోనూ.. ప్ర‌జ‌ల్లో ఈ ఉదంతం వెళ్లిపోవ‌టం.. యోగి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన నేప‌థ్యంలో న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు.

త‌క్ష‌ణ‌మే ఇద్ద‌రు పోలీసు అధికారుల్ని.. న‌లుగురు కానిస్టేబుళ్ల‌ను స‌స్పెండ్ చేయ‌టంతో పాటు.. అంత‌ర్గ‌త విచార‌ణ కోసం ఇద్ద‌రు అధికారుల‌తో క‌మిటీ వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రాష్ట్ర డీజీపీతో పాటు మంత్రి సైతం స్పందించారు. ఈ అంశంపై విచార‌ణ జ‌రిపి త్వ‌ర‌లోనే బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ అంశంపై విప‌క్ష నేత అఖిలేశ్ యాద‌వ్ విరుచుకుప‌డుతున్నారు. రాష్ట్రంలో దారుణ‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని.. అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేపై రేప్ ఆరోప‌ణ‌లు వ‌చ్చి ఏడాది గ‌డుస్తున్నా చ‌ర్య‌లు తీసుకోరా? అంటూ నిల‌దీస్తున్నారు. ఇదిలా ఉంటే.. త‌న‌పై వ‌చ్చిన రేప్ ఆరోప‌ణ‌ల్ని కొట్టిపారేశారు బీజేపీ ఎమ్మెల్యే కుల‌దీప్ సింగ్‌. త‌న‌ను ల‌క్ష్యంగా చేసుకొని.. త‌న కుటుంబాన్ని డ్యామేజ్ చేసేందుకే బాధిత మ‌హిళ నాట‌కాలు ఆడుతోంద‌న్నారు. త‌క్కువ స్థాయికి చెందిన మ‌నుషుల్ని త‌న‌పై ప్ర‌యోగించే కుట్ర‌ను త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ప్ర‌యోగించారంటూ చేసిన వ్యాఖ్య‌లు ఈ వ్య‌వ‌హార‌న్ని మ‌రింత వివాదంలోకి వెళ్లేలా చేస్తున్నాయి. నిష్ప‌క్ష‌పాతంగా చ‌ర్య‌లు తీసుకుంటార‌న్న పేరున్న సీఎం.. తాజా ఉదంతంలో ప్ర‌ద‌ర్శించిన నిర్ల‌క్ష్యం ఆయ‌న స‌ర్కారుకు ఇప్పుడు ఇబ్బందిక‌రంగా మారిందంటున్నారు.