Begin typing your search above and press return to search.

అమ్మ అడుగుజాడ‌ల్లో యోగి

By:  Tupaki Desk   |   9 April 2017 9:52 AM GMT
అమ్మ అడుగుజాడ‌ల్లో యోగి
X
ఊహించ‌ని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌నే కాదు.. వాటిని అంతే సామ‌ర్థ్యంతో అమ‌లు చేసి అంద‌రి మ‌న‌సుల్ని దోచుకున్న నాయ‌కురాలు త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్యమంత్రి అమ్మ అలియాస్ జ‌య‌ల‌లిత‌. అమ్మ పేరును బ్రాండ్ గా చేసుకొని.. క్యాంటీన్లు మొద‌లుకొని.. సిమెంటు.. నీళ్లు.. మందుల షాపులు.. ఇలా అవ‌కాశం ఉన్న ప్ర‌తి అంశంలోనూ అమ్మ బ్రాండ్‌ తో సంక్షేమ ప‌థ‌కాల్ని ఒక రేంజ్లో చేప‌ట్టారు. ఇదే ఆమెను.. వ‌రుస‌గా త‌మిళులు రెండోసారి ఎన్నుకోవ‌టానికి కార‌ణంగా చెప్పొచ్చు.

అనుకున్న ప్ర‌తి సంక్షేమ కార్య‌క్ర‌మం తూచా త‌ప్ప‌కుండా నిర్వ‌హించ‌టం అంత తేలికైన విష‌యం కాదు. అమ్మ నిర్వ‌హిస్తున్న క్యాంటీన్ల‌ను స్ఫూర్తిగా తీసుకొని.. అదే రీతిలో ఎన్టీఆర్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాల‌నా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భావించారు. ఎన్నిక‌ల్లో మా గొప్ప‌గా ప్ర‌చారం చేశారు. అధికారంలోకి వ‌చ్చి ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర మూడేళ్లు అవుతోంది. కానీ.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్టీఆర్ క్యాంటీన్ల విష‌యంలో బాబు స‌ర్కారు ఎంత‌గా ఫెయిల్ అయ్యిందో అంద‌రికి తెలిసిందే.

తాజాగా అమ్మ నిర్వ‌హించిన క్యాంటీన్ల కాన్సెప్ట్ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ‌న్ దృష్టికి వెళ్లింది. ఆయ‌న విప‌రీతంగా ఇంప్రెస్ కావ‌ట‌మే కాదు.. ఊహించ‌ని రీతిలో దీనికి సంబంధించిన మెనూను సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. ఉద‌యం పూట బ్రేక్ ఫాస్ట్‌ను రూ.3గా నిర్ణ‌యించ‌ట‌మే కాదు.. భోజ‌నాన్ని రూ.5ల‌కు అందించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. ఈ ప‌థ‌కానికి తుదిమెరుగులు దిద్దాల్సిందిగా యూపీ మంత్రులు స్వామి ప్ర‌సాద్ మౌర్య‌.. సురేష్ ఖ‌న్నాల‌కు ప్ర‌త్యేక బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఈ స‌బ్సిడీ క్యాంటీన్లను యూపీ రాజ‌ధాని ల‌క్నోతో పాటు కాన్పూర్‌.. ఘ‌జియాబాద్‌.. గోర‌ఖ్‌పూర్ ల‌లో ఏర్పాటు చేయాల‌ని భావిస్తున్నారు. రాష్ట్రం మొత్త‌మ్మీదా 200 వ‌ర‌కూ ఈ త‌ర‌హా క్యాంటీన్లు ఏర్పాటు చేయాల‌ని యోగి భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇదే త‌ర‌హాలో క్యాంటీన్ల‌ను బీజేపీ పాలిత రాష్ట్రమైన రాజ‌స్థాన్‌లో నిర్వ‌హిస్తున్నారు. కాకుంటే.. అక్క‌డ టిఫెన్ రూ.5 కాగా.. భోజ‌నం రూ.8. కానీ.. యూపీలో మాత్రం అక్క‌డి కంటే త‌క్కువ మొత్తానికి క్యాంటీన్లును నిర్వ‌హించాల‌ని భావించ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఈ ప‌థ‌కాన్ని అనుకున్న‌ట్లే విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తే..యోగికి అమ్మ‌కు వ‌చ్చినంత పేరు రావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/