Begin typing your search above and press return to search.

ఆరు నూరు అయినా యోగీనే...?

By:  Tupaki Desk   |   16 Jan 2022 2:49 PM GMT
ఆరు నూరు అయినా యోగీనే...?
X
ఆయన వయసు యాభై ఏళ్ళు. రాజకీయాల్లో ఈ ఏజ్ అంటే యువకుడు కిందనే లెక్క. ఇక ఆయన రాజకీయ అనుభవం వయసు పాతికేళ్ళు. దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయిన యూపీని ఆయన అయిదేళ్ళ పాటు నిక్షేపంగా నిభాయించిన సీఎం గా పేరు తెచ్చుకున్నారు. యూపీ సీఎం ల తరువాత స్థానం, స్థావరం ఏది అంటే ప్రధాని పీఠమే అని చరిత్ర చెబుతోంది. ఇక బీజేపీలో చూసుకుంటే ప్రధాని మోడీ తరువాత యోగీకే అంతటి పొలిటికల్ గ్లామర్ ఉంది. ఇక ఆరెస్సెస్ సిద్ధాంతాలను తుచ తప్పకుండా పాటించే అగ్రశ్రేణి నేతగా యోగీని చూస్తారు

అలాగే గోరఖ్ పూర్ లో అయనకు మఠం ఉంది. అంతా ఆయన్ని స్వామీజీగానే చూస్తారు. ఆయన వీర హిందూత్వగా పేరు గడించారు. ఒక విధంగా మోడీ కంటే ఆ విషయంలో రెండాకులు ఎక్కువ చదివారు అని అంటారు. ఇప్పటికి అయిదు సార్లు గోరఖ్ పూర్ నుంచి ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా, ఒకసారి ముఖ్యమంత్రి పనిచేసిన యోగీ బీజేపీకి ఒక విధంగా ఫ్యూచర్ లీడర్ అని అంటారు.

ఆయన మీద అటు పార్టీ మాత్రమే కాదు, ఆరెస్సెస్ కూడా ఎంతో ధీమా పెట్టుకుంది. యోగీతోనే బీజేపీ భవిష్యత్తు అని కాషాయదళం కూడా గంపెడాశలు పెట్టుకుంది. ఇక వచ్చే ఎన్నికల తరువాత మోడీకి ఏడున్నర పదుల వయసు వచ్చేసి ప్రధాని రేసు నుంచి తప్పుకుంటే యోగీవే ఆ సీట్లోకి వస్తారు అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. యోగీ ఆజన్మ బ్రహ్మచారి. ఆయన అపర హిందువు.

ఆయన ఈ దేశంలో హిందూత్వను ముందుకు తీసుకెళ్ళే నాయకుడు అని అంతా నమ్ముతారు. అలాంటి యోగీకి అధికార యోగం ఉండబట్టే ఇక్కడిదాకా వచ్చారు. 2017లో యూపీ ఎన్నికలు జరిగినపుడు కేంద్రంలో ఉన్న యోగీని తెచ్చి మరీ ముఖ్యమంత్రిని చేశారు. నాడు తానే యూపీ సీఎం అని యోగీకే తెలియదు.

అలా లక్ వచ్చి ఆయన్ని పలకరించింది. ఇప్పటిదాకా ఎక్కడా ఓటమెరుగని రాజకీయ జీవితం ఆయనది. ఇపుడు రెండవ దఫా ముఖ్యమంత్రి కావాలని యోగీ చూస్తున్నారు. మరి ఆయనకు అదృష్ట యోగం ఉందా. ఉంటే అది ఎంతవరకూ అంటే ఆయన సన్నిహితులు, బీజేపీ అభిమానులు మాత్రం యోగీ రాజకీయ‌పరుగు ఎక్కడా ఆగదని నిబ్బరంగా చెబుతున్నారు. యోగీ కచ్చితంగా మరోసారి యూపీ సీఎం అవుతారు. అంతే కాదు, ఆయన భవిష్యత్తులో దేశానికి నాయకత్వం వహిస్తారు అని కూడా అంటున్నారు.

మొత్తానికి లాజిక్ చూడ‌వద్దు, జాతకాలు వంటి మూఢ నమ్మకల జోలికి అసలే పోవద్దు, కానీ ఒక్కటి మాత్రం చూస్తే నిజం అనిపిస్తోంది. యోగీకి రాజయోగం చాలానే ఉంది. ఆయన యూపీ మాజీ సీఎం గా తన పొలిటికల్ కెరీర్ ని మధ్యలో ఆపేసే సీన్ అయితే లేదు అనిపిస్తోంది. అంటే ఏదో విధంగా బొటాబొటీ మెజారిటీతో అయినా ఆయన రెండవ సారి యూపీకి సీఎం అవుతారు అనే అంటున్నారు అంతా. ఇదంతా యోగీ పొలిటికల్ ట్రాక్ రికార్డు చూసి మాత్రమే సుమా. ఇదేమీ సర్వే కాదు, జోస్యం అంతకంటే కాదు. మొత్తానికి యూపీ బీజేపీకి ఈ టైమ్ లో కూడా ఊపిరి పోస్తే కనుక యోగీ కేవలం సీఎం తో ఆగిపోయే సీన్ అయితే లేదు, కచ్చితంగా దేశానికి ఏదో నాడు పీఎం కావడం డ్యామ్ ష్యూరే మరి.