Begin typing your search above and press return to search.

యోగి గెలుపు లెక్క‌లో అన్ని త‌ప్పులున్నాయా?

By:  Tupaki Desk   |   6 Dec 2017 11:15 AM GMT
యోగి గెలుపు లెక్క‌లో అన్ని త‌ప్పులున్నాయా?
X
అంకెలు అప్పుడ‌ప్పుడు మోసం చేస్తుంటాయ‌ని చెబుతుంటారు. ఆ మాట‌లో నిజం ఎంత‌న్న‌ది తాజా ఉదంతం చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. రెండు.. మూడు రోజుల క్రితం మీడియాలో ప్ర‌ముఖంగా ఒక వార్త క‌నిపించింది. దాని సారాంశం ఏమిటంటే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించింద‌ని. ఈ మాట‌కు త‌గ్గ‌ట్లే కొన్ని అంకెల్ని ప్ర‌తి మీడియా ఇచ్చేసింది. వారిచ్చిన అంకెల్ని చూసిన‌ప్పుడు అవును.. నిజ‌మే అన్న‌ట్లుంది.

ఫ‌లితాలు వెలువ‌డిన నేప‌థ్యంలో ఇచ్చిన స‌మాచారంతో బీజేపీ నేత‌లు పండ‌గ చేసుకున్నారు. యూపీలో యోగి హ‌యాంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో క‌మ‌లానికి ఎదురు లేద‌ని తేల్చేశారు. క‌థ ఇక్క‌డితో ముగిసిపోలేదు. లెక్క‌ల విష‌యంలో ఏదో తేడా ఉంద‌న్న సందేహంతో.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించిన మొత్తం లెక్క‌ను అసాంతం ప‌రికించి చూశారు కొంద‌రు మీడియా మిత్రులు. ఆ సంద‌ర్భంగా వారికి గుండెలు అదిరిపోయే విష‌యాన్ని గుర్తించారు. నిజానికి ఈ లెక్క వింటే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రిగా ఉన్న యోగి సైతం షాక్ తినాల్సిందే.

ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. యూపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించిన లెక్క‌ల్లో వాస్త‌వం కొంత‌మేర మాత్ర‌మేన‌ని.. మొత్తం ప‌లితాన్ని విశ్లేషిస్తూ.. అందుకు భిన్న‌మైన భావ‌న క‌ల‌గ‌టం ఖాయ‌మ‌ని చెప్పాలి. యూపీ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధికార బీజేపీ అభ్య‌ర్థులు 2366 స్థానాల్లో విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో బీజేపీ అభ్య‌ర్థులుగా బ‌రిలోకి దిగిన వారిలో 3656 మంది అభ్య‌ర్థులు త‌మ డిపాజిట్లు సైతం కోల్పోయారు.

అంటే.. యూపీ ఎన్నిక‌ల్లో మొత్తంగా పోటీ చేసిన వారిలో 45 శాతం మంది అభ్య‌ర్థులు డిపాజిట్లు కూడా సాధించ‌లేక‌పోయార‌న్న మాట‌. యూపీ స్థానిక పోరులో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో బీజేపీకి 30.8 శాతం ఓట్లు వ‌స్తే.. న‌గ‌ర పంచాయితీల్లో మాత్రం 11.1 శాతం ఓట్లు త‌గ్గిన‌ట్లుగా గుర్తించారు. మొత్తంగా స్థానిక ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థులు 8038 మంది పోటీ చేస్తే.. వారిలో దాదాపు స‌గం మంది డిపాజిట్లు కోల్పోయిన‌ట్లుగా గుర్తించారు. గెలుపు విష‌యం బాగానే ఉన్నా.. ఓట్లు ద‌క్కిన శాతంలో మాత్రం తేడా ఉండ‌టాన్ని గుర్తించారు. తాజా లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత నుంచి ఘ‌న విజ‌యం సాధించిన‌ట్లుగా చంక‌లు గుద్దుకున్న క‌మ‌ల‌నాథులు కామ్ అయిపోయిన‌ట్లు చెబుతున్నారు. గెలిచామ‌న్న మాట చెబితే.. డిపాజిట్ కోల్పోయిన విష‌యాన్ని.. ఓట్లు త‌క్కువ‌గా వ‌చ్చిన అంశంపై అడిగే ప్ర‌శ్న‌ల‌కు క‌మ‌ల‌నాథులు స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నార‌ట‌. గెలిచి ఓడ‌టం అంటే ఇదేనేమో?