Begin typing your search above and press return to search.

సీఎం దూకుడుః వంద మంది పోలీసుల స‌స్పెండ్!!

By:  Tupaki Desk   |   24 March 2017 12:33 PM GMT
సీఎం దూకుడుః వంద మంది పోలీసుల స‌స్పెండ్!!
X
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాచరణలోకి దిగిన యోగి ఆదిత్యనాథ్ త‌న‌ దూకుడును కొన‌సాగిస్తున్నారు. కేవ‌లం నాలుగు రోజుల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న వంద‌మందికి పైగా పోలీసుల‌ను స‌స్పెండ్ చేశారు. బుద్ధి మార్చుకోక‌పోతే మ‌రికొంద‌రిపై కూడా వేటు ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు. రాష్ట్ర రాజధాని లక్నోలోని హజ్రత్‌ గంజ్‌ లో ఉన్న పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడున్న మినీసెల్స్ - లాకప్ సదుపాయాలతోపాటు రికార్డులను పరిశీలించారు. ఇక మీదట కూడా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని సీఎం యోగి ఆదిత్య‌నాథ్ స్ప‌ష్టం చేశారు.

త‌మ రాష్ట్ర డీజీపీ జావీద్ అహ్మ‌ద్ ఆదేశాల మేర‌కు విధుల్లో అలసత్వం, అవినీతి ఆరోపణలపై 100మందికిపైగా పోలీసులు సస్పెన్షన్‌ కు గురైనట్లుగా యూపీ పోలీస్ ప్రజాసంబంధాల అధికారి రాహుల్ శ్రీవాస్తవ వెల్లడించారు. వీరిలో ఎక్కువమంది కానిస్టేబుళ్లు ఉన్నారని చెప్పారు. ఘజియాబాద్ - మీరట్ - నోయిడా - లక్నో ప్రాంతాలకు చెందిన పోలీసులపైనే ఎక్కువగా వేటు పడినట్లు తెలుస్తోంది. అక్ర‌మార్కుల‌పై వేటు వేయాల‌నే డీజీపీ ఆదేశాల మేర‌కు ఇంత భారీ సంఖ్య‌లో స‌స్పెన్ష‌న్లు విధించిన‌ట్లు స‌మాచారం. కాగా, ముఖ్య‌మంత్రిగా యోగి ఆదిత్య‌నాథ్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత హోం శాఖ కార్య‌ద‌ర్శి దేబాశిష్ పాండేకు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈమేర‌కు సీఎం ఆదేశాలు ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ఇదిలాఉండ‌గా....ఉత్తర్‌ ప్రదేశ్‌ లోని ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఇకపై టి-షర్టులు, జీన్స్‌ నిషేధిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్‌, గుట్కాలను నిషేధిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/