Begin typing your search above and press return to search.

అమిత్ షా స్థానంలో యోగి ఆదిత్యనాథ్

By:  Tupaki Desk   |   17 Jan 2019 3:58 PM GMT
అమిత్ షా స్థానంలో యోగి ఆదిత్యనాథ్
X
పాన్ ఇండియా ఛరిష్మా ఉన్నప్పటికీ కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కు ఆ రాష్ట్రంలోనే ఫాలోయింగ్ ఎక్కువ. అయితే... బీజేపీ ఆయన్ను ఇతర రాష్ట్రాల్లోనూ కీలకంగా ప్రయోగిస్తోంది. మొన్న ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ యోగి విస్తృతంగా ప్రచారం చేశారు. పదునైన ప్రసంగాలతో ఆకట్టుకోవడమే కాకుండా ఎంత భారీ ఈవెంట్ అయినా ఆర్గనైజ్ చేయగల సత్తా కూడా యోగి సొంతం. అలాంటి యోగిని బీజేపీ చాలా పెద్ద బాధ్యత అప్పగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అనారోగ్యంతో చికిత్స పొందుతుండడంతో కలకత్తాలో నిర్వహించాల్సిన ప్రతిష్ఠాత్మక ర్యాలీలను ఎవరు నడిపిస్తారన్నది సందేహంలో పడింది. అయితే.. పార్టీ మాత్రం అమిత్ షా స్థానంలో యోగికి ఆ బాధ్యత అప్పగించింది.

అమిత్ షా స్వైన్ ఫ్లూతో బాధ పడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం ఉంది. కానీ, జనవరి 20 నుంచి పశ్చిమబెంగాల్ లో బీజేపీ వరుస ర్యాలీలు ప్రారంభం కానున్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. ఫిబ్రవరి మొదటి వారం వరకు ఇవి కొనసాగనున్నాయి. వీటిలో పాదయాత్రలు కూడా ఉన్నాయి.

మరోవైపు, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ పశ్చిమబెంగాల్ లో రథయాత్రలకు అనుమతి ఇవ్వలేమని సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో బహిరంగసభలు, పాదయాత్రలకు బీజేపీ ప్లాన్ చేసింది. ఇప్పుడు అమిత్ షా స్థానంలో యోగి ఆ ర్యాలీలో పాల్గొంటారు. ఫిబ్రవరి 8న జరిగే చివరి ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. యోగి రాక నేపథ్యంలో మరింత గట్టి బందోబస్తు చర్యలు అవసరమని భావిస్తున్నారు.