Begin typing your search above and press return to search.

బ్యాన్ వేళ యోగి ఏం చేస్తున్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   17 April 2019 4:50 AM GMT
బ్యాన్ వేళ యోగి ఏం చేస్తున్నారో తెలుసా?
X
పోయిన చోటే వెతుక్కోమ‌న్న పాత సామెత‌ను ప‌క్కాగా ఫాలో అవుతున్నారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌. దేని కార‌ణంగా ఎన్నిక‌ల ప్ర‌చారానికి తాను దూర‌మ‌య్యానో.. ఇప్పుడు అదే అంశానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం ద్వారా.. యోగి ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల్సిన సందేశాన్ని ఇస్తున్నార‌న్న భావ‌న క‌లుగ‌క మాన‌దు. ఎన్నిక‌ల వేళ‌.. నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే న‌డ‌వ‌ద‌ని.. ఈసీ కాగితం పులి ఎంత మాత్రం కాద‌న్న‌ట్లుగా చెల‌రేగిపోవ‌టం తెలిసిందే.

సుప్రీం చేసిన వ్యాఖ్య‌లు కానీ.. త‌న ప‌ని తీరు మీద వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లో కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఒక్క‌సారిగా యాక్టివ్ కావ‌ట‌మే కాదు.. త‌ప్పుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటూ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఘాటు వ్యాఖ్య‌లు చేస్తూ.. వివాదాల‌కు తెర తీస్తున్న ఇద్ద‌రు ముఖ్య‌నేత‌ల ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం విధిస్తూ నిర్ణ‌యం తీసుకొన్న సంగ‌తి తెలిసిందే.

యూపీ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్.. బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ఇద్ద‌రిపై 72.. 48 గంట‌ల పాటు ప్ర‌చార నిషేధం విధించిన నేప‌థ్యంలో బ్యాన్ వేళ యోగి ఏం చేసి ఉంటారు? అన్న అనుమానం రాక మాన‌దు. అస‌లే.. యోగి.. అందులోకి ఎన్నిక‌ల వేళ‌.. బ్యాన్ విధిస్తే మాత్రం ఖాళీగా ఉంటారా? నోటితో మాట్లాడ‌కుండా ప‌రిమితులు విధించిన ఈసీ నిర్ణ‌యాన్ని యోగి ఎలా ఫాలో అయ్యార‌న్న‌ది చెక్ చేసిన‌ప్పుడు ఆస‌క్తిక‌ర అంశం దృష్టికి వ‌చ్చింది.

ఈసీ నిషేధంతో ఎన్నిక‌ల ప్ర‌చారానికి దూరంగా ఉన్న యోగి.. తాను చేసిన బ‌జ‌రంగ్ బ‌లీ మాట‌ను ఓట‌ర్ల‌కు అదే ప‌నిగా గుర్తు చేయాల‌ని అనుకున్నారో ఏమో కానీ.. ఆయ‌న యూపీలోని ప్ర‌ముఖ దేవాల‌య‌మైన హ‌నుమాన్ సేతు దేవాల‌యాన్ని సంద‌ర్శించారు. ఏ బ‌జ‌రంగ్ బ‌లీ మాట‌తో వేటు ప‌డిందో.. అదే విష‌యాన్ని గుర్తుకు తెచ్చే గుడికి వ‌చ్చిన యోగిని చూసి బీజేపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శించాయి.

జై బ‌జ‌రంగ్ బ‌లీజీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ గుడిలో సుమారు 25 నిమిషాలు ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు దృష్టి మొత్తం బజ‌రంగ్ బ‌లీ గుళ్ల మీద ప‌డుతోంది. నామినేషన్ వేసేందుకు కేంద్ర మంత్రి రాజ‌నాథ్ నిర్వ‌హించిన రోడ్ షోకు అటెండ్ కాని ఆయ‌న‌.. బుధ‌వారం అయోధ్య‌లోని రామ్ ల‌ల్లాను ద‌ర్శించుకోనున్నారు. త‌ర్వాత ద‌గ్గ‌ర‌లోని హనుమాన్ ఆల‌యాన్ని సంద‌ర్శించ‌నున్నారు. మొత్తానికి మూడు గుళ్లు.. అందులో బ‌జ‌రంగ్ బ‌లీ గుడి మిస్ కాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్న యోగి తీరు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.