Begin typing your search above and press return to search.

జ‌పాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తొలి భార‌తీయుడి గెలుపు!

By:  Tupaki Desk   |   25 April 2019 10:44 AM GMT
జ‌పాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తొలి భార‌తీయుడి గెలుపు!
X
జ‌పాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక భార‌త యువ కెర‌టం విజ‌యం సాధించిన వైనం సంచ‌ల‌నంగా మారింది. జ‌పాన్ రాజ‌ధాని టోక్యో ప‌రిధిలోని ఎదోగ‌వా వార్డు అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో భార‌త సంత‌తికి చెందిన పురాణిక్ యోగేంద్ర అలియాస్ 41 ఏళ్ల యోగి విజ‌యం సాధించారు.

1997లో తొలిసారి ఇంజ‌నీరింగ్ విద్యార్థిగా జ‌పాన్ లోకి అడుగు పెట్టిన యోగి.. రెండేళ్లు అక్క‌డే ఉన్న‌త విద్యాభ్యాసం చేశారు. అనంత‌రం భార‌త్ కు తిరిగి వ‌చ్చారు. త‌ర్వాత 2001లో ఒక ప్రైవేటు కంపెనీ ఇంజ‌నీర్ హోదాలో జ‌పాన్ కు వెళ్లిన ఆయ‌న‌.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. భార‌త మూలాలున్న వ్య‌క్తి జ‌పాన్ చ‌ట్ట‌స‌భ‌కు ఎన్నిక కావ‌టం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

యోగి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అసెంబ్లీ ప‌రిధిలో భార‌తీయులు అత్య‌ధికంగా నివసించ‌టం గెలుపుకున్న కార‌ణాల్లో ఒక‌టిగా చెబుతున్నారు. భార‌తీయుల‌తోపాటు.. చైనీయులు..కొరియ‌న్ల మ‌ద్ద‌తుతోనే త‌న గెలుపు సాధ్య‌మైంద‌ని చెబుతున్నారు యోగి.

2011లో సునామీ.. భూకంపాల‌తో టోక్యో న‌గ‌రం అత‌లాకుత‌ల‌మైన‌ప్పుడు స్థానికంగా నివ‌సించే భార‌తీయుల‌తో క‌లిసి బాధిత కుటుంబాల‌కు యోగి అండ‌గా నిలిచిన ట్రాక్ రికార్డు ఉంది. ఆ సంద‌ర్భంగా అక్క‌డి వారి క‌ళ్ల‌ల్లో ఆనందం చూసిన త‌ర్వాతే దేశానికి.. ప్రాంతానికి.. మ‌తాల‌కుఅతీతంగా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న ఉద్దేశంతోనే తాను జ‌పాన్ అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న‌ట్లు యోగి చెబుతున్నారు. ఆయ‌న కోరిక తీరాల‌ని.. భార‌తకీర్తిప‌తాకం జ‌పాన్ అసెంబ్లీలో ఎగుర‌వేయ‌ట‌మే కాదు.. మ‌రికొంత‌మందికి స్ఫూర్తిగా నిల‌వాల‌ని ఆశిద్దాం.