Begin typing your search above and press return to search.

ఒకే ఛార్జ్‌... లైఫ్ టైమ్ బ్యాట‌రీ!

By:  Tupaki Desk   |   23 Dec 2016 1:30 AM GMT
ఒకే ఛార్జ్‌... లైఫ్ టైమ్ బ్యాట‌రీ!
X
ఎంత గొప్ప ఫీచ‌ర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ అయినా దానిలో ద‌మ్మున్న బ్యాట‌రీ ఉండాలి. ఫోన్లు కొనేవాళ్లు ముందుగా చూసేది కూడా అదే. ఇక‌, ప్ర‌యాణాల్లో సెల్ ఫోన్ బ్యాట‌రీ గురించి టెన్ష‌న్ మామూలు ఉండ‌దు. బ్యాట‌రీ క‌రిగిపోతూ ఉంటే... ఛార్జింగ్ పెట్టుకోవ‌డానికి అవ‌కాశం లేక‌పోతే ఆ అవ‌స్థ‌లు మామూలుగా ఉండ‌వు. అయితే, ఈ మ‌ధ్య చాలామంది ప‌వ‌ర్ బ్యాంకులు వాడుతున్నారు. అవి కూడా డిశ్చార్జ్ అయిపోతే... ప‌రిస్థితి ఏంటీ..? ఇక‌పై ఇలాంటి బ్యాట‌రీ టెన్ష‌న్లేవీ ఉండ‌వ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే చాలు... ఆపై ఛార్జింగ్ అవ‌స‌రం లేని బ్యాట‌రీలు వ‌స్తున్నాయ‌ట‌!

మొబైల్ ఫోన్ల‌లో బ్యాట‌రీ క‌ష్టాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం క‌నుగొన్నామ‌ని చెబుతున్నారు బ్రిస్ట‌ల్ విశ్వ‌విద్యాల‌యానికి చెందిన ప‌రిశోధ‌కులు. ఒకే ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే చాలు.. జీవిత‌కాలం పాటు ప‌నిచేయ‌గ‌ల సామర్థ్యం ఉన్న బ్యాట‌రీని క‌నిపెట్టామ‌ని చెబుతున్నారు. జీవితం కాలం అంటే... ఆ బ్యాట‌రీ లైఫ్ టైమ్ అన్న‌మాట‌! ఇంత‌కీ.... ఆ బ్యాట‌రీ జీవిత కాలం ఎంతో తెలుసా.. 11 వేల సంవ‌త్స‌రాలు! అంత‌లా ఎలా సాధ్య‌మండీ అనేయ‌కండీ... అది డైమండ్ బ్యాట‌రీ. ఇలాంటి బ్యాట‌రీని ఫోన్లు - ట్యాబ్‌ లు - ల్యాప్ టాప్ ల‌లో వేసుకుంటే వాటిలో ప‌వ‌ర్ అయిపోతుంద‌న్న ప్ర‌శ్నే ఉండ‌దు. ఈ బ్యాట‌రీ గురించి మీకు ఇంకా న‌మ్మ‌కం క‌ల‌గాలంటే... కొంచెం డెప్త్ కి వెళ్లి సైన్స్ గురించి మాట్లాడుకుందాం!

అటామిక్ ప‌వ‌ర్ స్టేష‌న్ల‌లో కొన్ని వ్య‌ర్థాలు వ‌స్తుంటాయి. వాటిలో కార్బ‌న్‌-14 అనేది ఉంటుంది. దీంతో కృత్రిమ వ‌జ్రాల‌ను కూడా త‌యారు చెయ్యొచ్చు. అయితే, దీన్నుంచి విద్యుత్ కూడా వ‌స్తుంద‌ట‌. అదే విష‌యాన్ని ప‌రిశోధ‌కులు క‌నిపెట్టారు. అలా ఉత్ప‌న్నం అవుతున్న విద్యుత్ ని నేరుగా బ‌య‌ట‌కి రానీయ‌కుండా... డైమండ్ బ్యాట‌రీ పైపొర‌లో ఒక క‌వ‌చాన్ని ఏర్పాటు చేసుకుని మ‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా వినియోగించుకునే వీలు ఉంద‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు. ఇలా ఉత్ప‌న్న‌మ‌య్యే విద్యుత్ మాన‌వ శ‌రీరానికి హాని చేసేంత స్థాయిలో ఉండ‌ద‌నీ, కాబ‌ట్టి దీన్ని గాడ్జెట్ బ్యాట‌రీల్లో వాడుకునే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. అంటే, రాబోయే రోజులో ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే చాలు... జీవితాంతం వాడుకునే ఫోన్లు వ‌స్తాయ‌న్న‌మాట‌! ఆరోజులు ఎప్ప‌ట్నుంచీ వ‌చ్చేస్తాయంటే... ఆ విష‌యం చెప్ప‌డానికి మ‌రికొంత ప‌రిశోధ‌న‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/