Begin typing your search above and press return to search.

మీకు తెలుసా.. ఈ మూడు కరోనా లక్షణాలే..!

By:  Tupaki Desk   |   24 April 2021 3:30 PM GMT
మీకు తెలుసా.. ఈ మూడు కరోనా లక్షణాలే..!
X
కొవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా తన విశ్వరూపం చూపిస్తోంది. పలు రాష్ట్రాల్లో మహమ్మారి విలయతాండవంతో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. శ్వాస సంబంధ సమస్యలతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సెకండ్ వేవ్ కాబట్టి అతి త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ఫలితంగా రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మొదటి దశలో జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, శ్వాస సంబంధ సమస్యలు, దగ్గు, రుచి, వాసన కోల్పోవడం వంటివి లక్షణాలు అని వైద్యులు గుర్తించారు. రెండో దశలు మరికొన్ని కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని తేల్చారు. ఈ దశలో వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో లక్షణాలు పెరుగుతున్నాయని వివరించారు. అయితే వాటిని పట్టించుకోకుండా ఉంటే ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు.

కళ్లు గులాబీ రంగు
ఒక్కసారిగా కళ్లు గులాబీ రంగులోకి మారితే అస్సలు అశ్రద్ధ చేయొద్దని వైద్యులు తెలిపారు. చైనాలో నిర్వహించిన పరిశోధనల ప్రకారం సెకండ్ వేవ్లో కళ్ల కలక లక్షణం ఉందని తేల్చారు. ఒక్కసారిగా కళ్ల కలక, కళ్ల వాపు, అదే పనిగా కళ్ల నుంచి నీరు కారడం, కళ్లలో మంటలు ఏమైనా ఉంటే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రెండో దశలో చైనాలోని ప్రతి 12 మందిలో ఒకరికి ఈ లక్షణం ఉన్నట్లు వెల్లడించారు.

వినికిడి సమస్య
కొవిడ్ మహమ్మారితో వినికిడి సమస్య కొత్తగా వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఒక్కసారిగా సరిగా వినిపించకపోవడం, అదేపనిగా చెవిలో ఏదో శబ్దం వచ్చినట్లుగా అనిపించినా కరోనా వచ్చినట్లేనని అంటున్నారు. ఇలాంటి సమస్యలు గుర్తిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని సూచించారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆడియాలజీలో దీని గురించి ప్రస్తావించారు. 56 అధ్యయనాల అనంతరం ఈ లక్షణాన్ని ధ్రువీకరించినట్లు వెల్లడించారు. కొవిడ్ వచ్చిన వారిలో 7.6శాతం మందిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని తేల్చారు.

జీర్ణాశయ సంబంధ సమస్యలు
జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలూ కరోనా లక్షణం అయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యలు తలెత్తితే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వీటితో పాటు మరికొన్ని కొత్త లక్షణాలు ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ కరోనా కాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దని చెబుతున్నారు.