Begin typing your search above and press return to search.

మోడీ నిర్ణయంతో కశ్మీర్ కు ఎంత నష్టమో తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   18 Dec 2019 6:59 AM GMT
మోడీ నిర్ణయంతో కశ్మీర్ కు ఎంత నష్టమో తెలిస్తే షాకే
X
సుదీర్ఘకాలంగా సాగుతున్న ఆర్టికల్ 370 ఇష్యూను మోడీ సర్కారు ఒక కొలిక్కి తీసుకొస్తూ.. చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు జమ్ముకశ్మీర్ ను భిన్నంగా ఉంచే ఆర్టికల్ 370ను నిర్వీర్యం చేస్తూ మోడీ సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలో చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీగా కట్టుదిట్టమైన భద్రతాచర్యల్ని జమ్ముకశ్మీర్ లో చేపట్టారు.

నెలల తరబడి జమ్ముకశ్మీర్ లో కొనసాగిన అనిశ్చితి.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఆ రాష్ట్రానికి ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో వ్యాపార సంస్థలు మూతపడటం.. లక్షల్లో ఉద్యోగాలు పోవటం లాంటి కారణాలతో ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు.

కశ్మీర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ఆర్టికల్ 370 నిర్వీర్యం తర్వాత నాలుగు నెలల్లో కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ రూ.17,878కోట్ల నష్టాన్ని చవిచూసినట్లుగా చెబుతున్నారు. ఈ నివేదిక ప్రకారం లక్షలాది ఉద్యోగాలు పోయాయని.. ఐటీ.. ఈ-కామర్స్ మీద నేరుగా ఆధారపడే రంగాలు నాశనమైనట్లుగా పేర్కొంది.

జరిగిన నష్టాన్ని అంచనా వేయటానికి.. రైతుల్ని ఆదుకోవటానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెబుతున్నారు.తాజా నివేదికను జమ్ముకశ్మీర్ లోని సుమారు 55 శాతం జనాభా కలిగిన పది జిల్లాల్లో అధ్యయనం చేయటం ద్వారా రూపొందించారు. పర్యాటక రంగం గందరగోళంలో ఉందని.. తయారీ రంగానికి భారీ నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. చేతివృత్తులవారు, నేత కార్మికులు నిరుద్యోగులుగా మారుతున్న విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఆర్టికల్ 370 నిర్వీర్యంతో పని అయిపోనట్లు కాక.. ఆర్థిక వ్యవస్థను పట్టాల మీదకు ఎక్కించటం ద్వారా కశ్మీరీల మనసుల్ని దోచుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని చెప్పక తప్పదు.