Begin typing your search above and press return to search.

పెళ్లి కంటే ఓటు ముఖ్యమట...

By:  Tupaki Desk   |   16 May 2016 12:20 PM GMT
పెళ్లి కంటే ఓటు ముఖ్యమట...
X
ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరంపై ఎన్నికల సంఘం చేసే ప్రచారాన్ని బాగా అర్థం చేసుకుందో ఏమో కానీ ఓ వధువు ముహూర్తానికి ముందు ఓటేయడానికి వచ్చింది. కేరళలో జరుగుతున్న పోలింగులో ఈ రోజు పెళ్లి కూతురు ముస్తాబులో ఓ పాతికేళ్ల నవ వధువు పోలింగ్ కేంద్రానికి వచ్చింది. తన జీవితంలో పెళ్లి ఎంత ముఖ్యమో... దేశ పౌరురాలిగా ఓటేయడం కూడా అంతే ముఖ్యమని చెబుతోందామె. అనూ అనే ఈ యువతికి సోమవారం ఉదయం వివాహం చేయడానికి ముహూర్తం పెట్టారు. పెళ్లి పీటలు ఎక్కేముందు పెళ్లి కూతురిగా ముస్తాబు చేయించుకోవడానికి బ్యూటీ పార్లర్ కు వెళ్లిన ఆమె అక్కడ ముస్తాబు పూర్తయిన తరువాత నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చింది. బంగారం రంగు చీర.. నిండుగా నగలతో వచ్చి ఓటేసింది.

కాగా ఓటు వేయడం ఈ పెళ్లికూతురికి ఇదే తొలిసారట. ఓటు వేసిన తరువాత ఆమెను మీడియా చుట్టుముట్టడంతో కాసేపు ఆమె మాట్లాడుతుండడంతో తల్లిదండ్రులు, బంధువులు అక్కడకు చేరుకుని ముహూర్తం టైం అవుతోంది రమ్మని పిలుస్తూ తీసుకెళ్లారు. అలా ఓటు వేశాక పెళ్లి మండపానికి చేరుకుని ముహూర్తం వేళకి తాళి కట్టించుకుంది.

కాగా మహాలక్ష్మిలా వచ్చిన నవ వధువు తమకే ఓటు వేసిందని అక్కడి పోటీదారులు ఎవరికి వారు చెప్పుకొంటున్నారు. స్థానికులు మాత్రం నవ వధువు ఎవరికి ఓటేస్తే వారు గెలిచే అవకాశాలుంటాయని సెంటిమెంటు మాటలు చెబుతున్నారు. వధువు మాత్రం తాను ఎవరికి ఓటేసిందీ చెప్పకపోయినా ఓటు ఎంత విలువైనదో మాత్రం చెప్పినట్లయింది.