Begin typing your search above and press return to search.

బద్వేల్ యువ వైద్యుడి మరణం.. తెలుగు ప్రజలకో వార్నింగ్

By:  Tupaki Desk   |   9 Nov 2020 4:30 AM GMT
బద్వేల్ యువ వైద్యుడి మరణం.. తెలుగు ప్రజలకో వార్నింగ్
X
ఒక రేంజ్లో విరుచుకుపడి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చుక్కలు చూపించిన కరోనా.. ఇప్పడు బలహీనపడింది. అలా అని.. దాని ముప్పు పూర్తిగా పోయినట్లు కాదు. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కరోనా చేసిన రచ్చ ఇంతా అంతా కాదు. ఇటీవల కాలంలో తగ్గుముఖం పట్టిన కేసుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల్లో నిర్లక్ష్యం అంతకంతకూ పెరుగుతోంది. దీనివల్ల రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇలాంటివేళ.. కడప జిల్లా బద్వేలుకు చెందిన ఒక యువ వైద్యుడి మరణం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు హెచ్చరికగా మారాల్సిన అవసరం ఉంది. ఒకసారి కరోనాను జయించిన ఈ చిన్నపిల్లల డాక్టర్.. రెండోసారి కరోనా వ్యాప్తి చెంది.. వైరస్ లోడ్ కు మరణించారు. విన్నంతనే ఉలిక్కిపడేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. కడప జిల్లాలోని బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడిగా 28 ఏళ్ల నందకుమార్ కు మంచి పేరుంది.

మూడు నెలల క్రితం ఇతడికి కరోనా సోకింది. గుంటూరు ఎన్ఆర్ఐలో చికిత్స తీసుకొని కోలుకున్నారు. అనంతరం ఎప్పటిలానే ఆసుపత్రికి వెళుతూ.. రోగులకు ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. పదిహేను రోజుల క్రితం మహేశ్ కు మరోసారి జ్వరం వచ్చింది. దీంతో అనుమానపడిన ఆయన.. కరోనా టెస్టు చేయించుకున్నారు.రెండోసారి కరోనా సోకినట్లుగా గుర్తించారు. దీంతో.. ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకున్నారు.

బ్యాడ్ లక్ ఏమంటే.. వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతుండటంతో ఆయన్ను తిరుపతి స్విమ్స్ కు తరలించారు. అనంతరం పరిస్థితి విషమించటంతో హుటాహుటిన చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడకు వెళ్లిన తర్వాత పరిస్థితి మరింతగా విషమించింది. ఎంతో ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. చిన్న వయసులోనే నూరేళ్లు నిండేలా చేసిన కరోనాను తిట్టిపోస్తున్నారు. ఎవరేం అన్నా.. పోయిన మనిషి తిరిగి రాలేదు. ఈ అనుభవంతోనైనా.. తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే కరోనా వచ్చి తగ్గిన వారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా.. భారీ మూల్యం చెల్లించక తప్పదన్నది మర్చిపోకూడదు.